
ఆస్కార్ అవార్డుల సంబరానికి రంగం సిద్ధమైంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో మార్చి 12 న అంటే భారత కాలమానం ప్రకారం మనకు రేపు అంటే మార్చి 13 తెల్లవారుఝామున అన్నమాట …… ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనుంది. అందుకు రంగం సిద్ధమైంది. ఆస్కార్ అవార్డుల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే మిగతా దేశాల సంగతి పక్కన పెడితే …….మన భారతీయులు మాత్రం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం ” ఆర్ ఆర్ ఆర్ ” నాటు నాటు సాంగ్ కోసం.
అవును 140 కోట్ల భారతీయులలో అత్యధికులు ఆస్కార్ అవార్డు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ బరిలో నిలిచింది. అంతేకాదు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మనకు అవార్డు దక్కడం ఖాయమని భావిస్తున్నారు. దాంతో ఆస్కార్ కోసం భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ అవార్డుల పోటీ మరింత రక్తికట్టడానికి కారకులు జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ , ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జూనియర్ ఎన్టీఆర్ అలాగే రాంచరణ్ లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఊర మాస్ అభిమానులు ఉన్నారు. పక్కా కమర్షియల్ హీరోలు కావడంతో నందమూరి – మెగా కుటుంబాలను ఆదరించేవాళ్ళు ఆస్కార్ కోసం తహతహలాడుతున్నారు. భారతీయులకు గర్వకారణమైన సంఘటన జరుగబోతోంది అనే ఆత్రుత నెలకొంది. మరికొద్ది గంటల్లోనే ఆ అద్భుత క్షణాలు ఆవిష్కృతం కానున్నాయి. అందుకోసమే యావత్ భారత్ ఎదురు చూస్తోంది.