తమిళ స్టార్ హీరో అజిత్ తాజాగా 62 వ చిత్రాన్ని ఇటీవల ప్రకటించాడు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మొదట ఈ చిత్రానికి నయనతార భర్త విగ్నేష్ శివన్ ని అనుకున్నారు. అయితే కథ విషయంలో అజిత్ ను మెప్పించలేకపోయాడు విఘ్నేష్ దాంతో అతడిని తొలగించి మగిజ్ తిరుమేని ని దర్శకుడిగా ఎంపిక చేసారు.
ఈ చిత్రానికి ” డెవిల్ ” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మార్చి రెండో వారంలో డెవిల్ టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారట దర్శక నిర్మాతలు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అజిత్ కుమార్ ను మరో లెవల్ లో చూపించడానికి సమాయత్తం అవుతున్నాడు దర్శకుడు మగిజ్ తిరుమేని.
ఇటీవలే అజిత్ నటించిన తునివు విడుదలైన విషయం తెలిసిందే. సంక్రాంతి రేసులో దూసుకొచ్చిన ఈ చిత్రం తెలుగులో తెగింపు టైటిల్ తో డబ్ అయ్యింది. తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ అజిత్ కున్న క్రేజ్ తో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తమిళంలో హిట్ అయింది. దాంతో ఈసారి అజిత్ ను డెవిల్ గా చూపించడానికి సిద్ధమౌతున్నారు అజిత్ 62 చిత్ర బృందం.