వివాదాస్పద హీరోయిన్ అమలాపాల్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. తాజాగా ఈ భామ ఓ గుడికి దర్శనం కోసం వెళ్ళింది అయితే ఆలయ అధికారులు అమలాపాల్ ను అడ్డుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం వెళ్లిన అమలాపాల్ ను అడ్డుకోవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? సంఘటన వివరాలలోకి వెళితే ……
కేరళ లోని ఎర్నాకులంలో తిరువైరానికుళం మహాదేవ ఆలయంలోకి కేవలం హిందువులను మాత్రమే అనుమతిస్తారు. ఇతర మతస్థులను లోపలకు అనుమతించరు. ఈ సంప్రదాయం చాలాకాలంగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఇదే ఆలయానికి వెళ్లాలని అనుకున్న అమలాపాల్ అమ్మవారి దర్శనం కోసం వెళ్ళింది.
అమలాపాల్ క్రిస్టియన్ కావడంతో లోపలకు అనుమతి ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు ఆలయ అధికారులు. దాంతో రిజిస్టర్ లో తన అసంతృప్తి వ్యక్తం చేసింది అమలాపాల్. అన్య మతస్థురాలినని నన్ను లోపలకు అనుమతించలేదు ….. అయినప్పటికీ నేను దూరం నుండే అమ్మవారిని దర్శించుకున్నాను …… సరికొత్త అనుభూతికి లోనయ్యాను …. అయితే అమ్మవారిని దగ్గరగా దర్శించుకుంటే మరింతగా బాగుండేది. 2023 లో కూడా మతం గురించి పట్టింపులు కొనసాగుతుండటం విచారకరమన్నారు అమలాపాల్.