
ఆస్కార్ బరిలో ఈసారి భారత్ తరుపున మూడు చిత్రాలు పోటీపడగా అందులో రెండు చిత్రాలు ఆస్కార్ అందుకోవడం గమనార్హం. ఒకటి ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు అనే పాట కాగా మరొకటి ” The Elephant wishperers ” డాక్యుమెంటరీ ఫిలిం. ప్రపంచమంతా ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్ మోత మోగిస్తోంది. అయితే ఇదే సమయంలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ కథ ఏంటి ? అని ఆసక్తిగా చూస్తున్నారు ….. నెట్ లో సెర్చ్ చేస్తున్నారు.
గత ఏడాది ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. అనాధగా మారిన ఓ చిన్న ఏనుగును ఓ ఆడ , మగ దగ్గరకు తీసుకొని దాన్ని పెంచి పెద్ద చేసిన కథే ” ది ఎలిఫెంట్ విష్పరర్స్ ” కథ. ఏ సినిమాను రూపొందించడానికి ఏకంగా 5 సంవత్సరాల సమయం తీసుకున్నారు. ఎందుకంటే ఏనుగుల గురించి కథ అందునా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యే కథ కాబట్టి ఏనుగుల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే చేయాలని నిర్ణయించుకున్నారట.
ఇక ఐదేళ్ల పాటు తీసిన సినిమా కావడంతో ఈ సినిమాకు అయిదుగురు కెమెరామెన్లు పనిచేయడం విశేషం. కేవలం 40 నిమిషాల నిడివి మాత్రమే ఉన్న ది ఎలిఫెంట్ విష్పరర్స్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. కార్తికి గోన్ సాల్వేస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. వైల్డ్ లైఫ్ మీద , పర్యావరణం మీద శ్రద్ధాసక్తులు ఉన్న కార్తికి గోన్ సాల్వేస్ ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇక ఇప్పుడేమో ఆస్కార్ కొట్టేసింది.