
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ” పొన్నియన్ సెల్వన్ ” మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 325 కోట్ల వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. సెప్టెంబర్ 30 న విడుదలైన ఈ చిత్రానికి మొదట చాలా డివైడ్ టాక్ వచ్చింది. సినిమా చాలా స్లోగా ఉందని , స్టార్ లున్నప్పటికీ ఎవరిని కూడా ఉపయోగించుకోలేకపోయారంటూ మణిరత్నం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
అయితే ఆ విమర్శలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. విమర్శల స్థానంలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పొన్నియన్ సెల్వన్ 325 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఆ చిత్ర బృందం చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సినిమా విడుదల అయిన సమయంలో వచ్చిన టాక్ చూసి ప్లాప్ లేదా యావరేజ్ అనే అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ భారీ వసూళ్లు సాధించడంతో ట్రేడ్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యానికి లోనౌతున్నారు.
విక్రమ్ , కార్తీ , ఐశ్వర్యారాయ్ , జయం రవి , త్రిష , ప్రకాష్ రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగం సెప్టెంబర్ లో విడుదల కాగా రెండో భాగం మాత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. రెండో భాగం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారట. ఇక ఈ చిత్రాన్ని వెండితెరపైకి తీసుకురావడానికి 40 ఏళ్లుగా కృషి చేస్తూనే ఉన్నాడు మణిరత్నం. అది ఇన్నాళ్లకు నెరవేరింది.