సూపర్ స్టార్ రజనీకాంత్ 170 వ చిత్రం అనౌన్స్ మెంట్ ఊహించని విధంగా వచ్చింది. ఈరోజు లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సినిమా అనౌన్స్ చేసారు. రజనీకాంత్ 170 వ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఎవరో తెలుసా ……. జ్ఞానవేల్.
లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సూపర్ స్టార్ రజనీకాంత్ పలు చిత్రాలు చేసాడు. లైకా ప్రొడక్షన్స్ అధినేతలతో రజనీకాంత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి దాంతో మళ్ళీ వాళ్లకు అవకాశం ఇచ్చాడు. తాజాగా రజనీకాంత్ జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జైలర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గతకొంత కాలంగా రజనీకాంత్ నటించిన చిత్రాలేవీ విజయం సాధించడం లేదు. భారీ వసూళ్లు అయితే సాధిస్తున్నాయి కానీ బడ్జెట్ ఎక్కువ కావడం అలాగే ఎక్కువ రేట్లకు బయ్యర్లకు అమ్మడం వల్ల బయ్యర్లకు పెద్దగా లాభాలు రావడం లేదు. చాలామంది బయ్యర్లు నష్టపోతూనే ఉన్నారు. అయితే ఎంతగా నష్టపోతున్నా రజనీకాంత్ సినిమా అంటే చాలు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. బయ్యర్లు పోటీ పడి కొంటునే ఉన్నారు. మరి ఈ జైలర్ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.