
ఉపరాష్ట్రపతి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేసాడు సూపర్ స్టార్ రజనీకాంత్. నిన్న చెన్నై లో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు , సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆ వేడుకలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వెంకయ్య కు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం నాకు నచ్చలేదు. రాష్ట్రపతికి అలాగే ఉపరాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు ఉండవు. రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించేవాళ్లకు అలాంటి పదవులు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు.
వెంకయ్య నాయుడు మరికొన్నాళ్లు కేంద్ర మంత్రిగా ఉంటే మరింత మంచి జరిగేది. క్రియాశీలకంగా వ్యవహరించేవాళ్ళు కీలక పదవుల్లోనే ఉండాలి. నేను ఉపరాష్ట్రపతి పదవిని కించపరచడం లేదు. కాకపోతే ఆ పదవికి ఎలాంటి అధికారాలు లేవు , ప్రోటోకాల్ కండీషన్స్ ఉంటాయి అందుకే వెంకయ్యను ఉపరాష్ట్రపతిని చేయడం నాకు నచ్చలేదు అంటూ కుండబద్దలు కొట్టారు రజనీకాంత్.
భారతీయ జనతా పార్టీలో అటల్ బిహారీ వాజ్ పేయి , లాల్ కృష్ణ అద్వానీ ల తర్వాత అంతటి శక్తివంతుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు. అహర్నిశలు పార్టీ ఎదుగుదల కోసం కష్టపడ్డారు. కేంద్రమంత్రిగా తనదైన ముద్ర వేసారు వెంకయ్య. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మోడీ – షా లను పదేపదే కోరుతుండటంతో వెంకయ్యను ఉపరాష్ట్రపతిని చేస్తే సైడ్ చేసినట్లే కదా ! అని భావించారట మోడీ -షా ద్వయం. అందువల్లే వెంకయ్యను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయించి ఉపరాష్ట్రపతి అనే గౌరవప్రదమైన హోదా కట్టబెట్టినట్లు అప్పట్లోనే ఊహాగానాలు వినిపించాయి. ఇన్నాళ్లకు రజనీకాంత్ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు అంతే తేడా !.