
తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మార్క్ ఆంటోనీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది మార్క్ ఆంటోనీ . ఈ చిత్రంలో విశాల్ గెటప్ కు అద్భుతమైన స్పందన వచ్చేలా కనబడుతోంది. ఎందుకంటే గుబురు గడ్డం , గుబురు మీసాలతో విశాల్ చాలా విభిన్నంగా ఉన్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగింది.
ఓ భారీ గోడను ఢీకొట్టి దాన్ని బద్దలు కొట్టి ఓ భారీ వాహనం రావాలి. గోడను అయితే బాగానే ఢీకొట్టింది. అయితే గోడను ఢీకొట్టడమే కాకుండా అక్కడే ఉన్న జనాల మీదకు దూసుకుంటూ వచ్చింది. దాంతో తమ మీదకు భారీ ట్రక్కు వస్తుండటంతో ఒక్కసారిగా అక్కడే ఉన్న జూనియర్ ఆర్టిస్టులు పరుగు పరుగున పక్కకు పారిపోయారు. దాంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే ఘోరం జరిగి ఉండేది.
ఈ యాక్సిడెంట్ తాలూకు వీడియో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. విశాల్ నటించే ప్రతీ సినిమాలో ఏదో ఒక యాక్సిడెంట్ జరగడం , గాయాలు కావడం చాలా కామన్ అయిపోయింది. గతంలో కూడా పలు చిత్రాల్లో ఇలాగే జరిగింది. ఇక విశాల్ గత కొన్ని సంవత్సరాలుగా నటిస్తూనే ఉన్నాడు కానీ సక్సెస్ అనేది చూసి చాలా సంవత్సరాలే అవుతోంది. సక్సెస్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు కానీ సక్సెస్ మాత్రం అందని ద్రాక్షే అవుతోంది.