
ఈరోజు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జయంతి దాంతో తమ మధ్య లేకపోయినా ఆ హీరోను తలుచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు అభిమానులు. కన్నడ చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నెంబర్ వన్ హీరో. కన్నడ దిగ్గజం రాజ్ కుమార్ తనయుడిగా చిత్ర రంగప్రవేశం చేసినప్పటికీ అచిర కాలంలోనే తనదైన ముద్ర వేసి అభిమానులను అలరించి నెంబర్ వన్ హీరోగా చెరిగిపోని కీర్తిని సొంతం చేసుకున్నాడు.
పునీత్ రాజ్ కుమార్ బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. అంతేకాదు బాల నటుడిగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నాడు. 2002 లో అప్పు అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా తెలుగులో రవితేజ హీరోగా నటించిన ” ఇడియట్ ” సినిమాకు రీమేక్. తెలుగులో పెద్ద హిట్ అయినట్లుగానే కన్నడంలో కూడా పెద్ద హిట్ అయ్యింది. మొదటి చిత్రంతోనే యూత్ ని అలరించి బ్లాక్ బస్టర్ హీరోగా తిరుగులేని స్టార్ డం అందుకున్నాడు.
46 ఏళ్ల వయసున్న పునీత్ రాజ్ కుమార్ ఎక్సర్ సైజ్ చేస్తూ గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 2021 అక్టోబర్ 29 న మరణించి అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తాడు. పునీత్ మరణంతో యావత్ కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర షాక్ కు గురయ్యింది. అయితే పునీత్ బ్రతికి ఉన్న సమయంలోనే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసాడు కానీ వాటి గురించి బయటకు తెలియనీయలేదు. గుప్తదానాలు పెద్ద ఎత్తున చేసాడు.
ఎప్పుడైతే పునీత్ రాజ్ కుమార్ మరణించాడో అప్పుడు మాత్రమే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే పునీత్ సహాయం పొందిన వాళ్ళు చెప్పిన వివరాలు చూసి యావత్ ప్రపంచమే షాక్ అయ్యింది.
పునీత్ రాజ్ కుమార్ 45 పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది స్టూడెంట్స్ కు ఉచిత విద్య అందించాడు.
26 అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేసి వందలాది మందికి ఆశ్రయం కల్పించాడు.
16 వృద్ధుల ఆశ్రమాలను ఏర్పాటు చేసి వందలాది మంది వృద్ధులకు కొడుకుగా మారి వాళ్ళను ఆదుకున్నాడు.
19 గోశాలలు ఏర్పాటు చేసి వందలాది గోవులను సంరక్షించాడు.
ఇవే కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాడు. అయితే ఇవన్నీ పునీత్ రాజ్ కుమార్ చనిపోయాక మాత్రమే బయటి ప్రపంచానికి తెలిసాయి. ఇంత పెద్దన సేవా కార్యక్రమాలు చేసి కూడా బయటి ప్రపంచానికి తెలియకుండా చేసిన గొప్ప మానవతావాది పునీత్ రాజ్ కుమార్ అనే చెప్పాలి. ఈరోజు పునీత్ రాజ్ కుమార్ జయంతి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ మహనీయుడిని స్మరించుకుంటోంది అభిమానాలోకం.