
కన్నడ చిత్రపరిశ్రమలో చిన్న చిత్రంగా వచ్చిన కాంతార బాక్సాఫీస్ ను బద్దలు కొట్టి యావత్ భారత్ చిత్ర పరిశ్రమనే షాక్ అయ్యేలా చేసిన విషయం తెలిసిందే. అండర్ డాగ్ గా వచ్చిన కాంతార వసూళ్ల సునామీ సృష్టించింది. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను దున్నేసి ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది.
కట్ చేస్తే ఇప్పుడు కాంతార చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. కాంతార చిత్రాన్ని ఏకంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అయిన జెనీవాలో ఈరోజు ప్రదర్శించనున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ చిత్రాన్ని పలు దేశాలకు చెందిన ప్రతినిధులు తిలకించనున్నారు. చిత్ర ప్రదర్శన అనంతరం దర్శకుడు , హీరో అయిన రిషబ్ శెట్టి ప్రసంగించనున్నాడు. అందుకోసం రిషబ్ శెట్టి స్విట్జర్లాండ్ చేరుకున్నాడు.
తన సినిమాను అంతర్జాతీయ వేదిక అయిన ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శించడం తనకు ఎంతో గర్వకారణమని సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు రిషబ్ శెట్టి. కాంతార బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో కాంతార 2 చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.