డైరెక్టర్ గా హీరోగా నటిస్తూ సత్తా చాటుతున్నారు ఇద్దరు. ఒకవైపు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు హీరోగా నటించడం అంటే మాటలు కాదు. ఎన్నో వ్యవప్రయాసాలకోర్చి చేయాల్సి ఉంటుంది. అనుకున్నంత సులువు కాదు. ఎందుకంటే ఈ రెండు కూడా సినిమాకు మెయిన్ పిల్లర్స్. అలాంటి రెండు ప్రధానమైన బాధ్యతలను భుజాన వేసుకొని సినిమా చేయడమే కాకుండా భారీ విజయాన్ని అందుకున్నారు కన్నడనాట రిషబ్ శెట్టి , తమిళనాట ప్రదీప్ రంగానాథన్.
అసలు కాంతార సినిమాలో దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించాల్సి ఉండే ……కానీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో చిన్న బడ్జెట్ లో చేద్దామని రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మొదట కన్నడంలో విడుదల అయ్యింది. అక్కడ బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగు , తమిళ , హిందీ భాషల్లో విడుదల చేశారు. ఇంకేముంది అన్ని భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో రిషబ్ శెట్టి పేరు మారుమ్రోగుతోంది.
ఇక తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్ విషయానికి వస్తే…… ఈరోజుల్లో యువతీ యువకుల మధ్య ప్రేమ ఎలా ఉంది అనే కథాంశంతో లవ్ టుడే అనే సినిమా తీసాడు. ఇందులో హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా చేపట్టాడు. తమిళనాట ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. దాంతో ఇప్పుడు మిగతా భాషల్లో కూడా విడుదలైంది. ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి 100 కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో యంగ్ టాలెంట్ మీద మరోసారి చర్చ జరుగుతోంది.