ఒక్క హిట్ ….. ఒక్క హిట్ అంటూ తపిస్తున్నాడు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ. RX 100 చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టాడు. మొదటి చిత్రంతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత కార్తికేయ నటించిన చిత్రాలన్నీ వరుసగా ఘోరంగా విఫలమయ్యాయి. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నెగెటివ్ క్యారెక్టర్ లు కూడా చేస్తూనే ఉన్నాడు. తనలోని నటుడ్ని మరింతగా విస్తృత పరిచేలా విభిన్న పాత్రలను పోషిస్తున్నాడు. అయితే విభిన్న పాత్రలను పోషిస్తున్నాడు కానీ ఆశించిన స్థాయిలో విజయాలు దక్కించుకోలేక పోయాయి.
దాంతో కసిగా ఇప్పుడు చేస్తున్న చిత్రం ” బెదురులంక – 2012 “. తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. 2012 లో ప్రపంచం అంతం కాబోతోంది అనే అప్పటి అంశాన్ని మేళవించి ఈ సినిమా తీశారు. డ్రామా , కామెడీ అంశాలతో ఈ బెదురు లంక చిత్రం రూపొందింది. ఈ సినిమాపై కార్తికేయ చాలా ఆశలు పెట్టుకున్నాడు. గ్లామర్ పాప నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది ఈ చిత్రంలో. దాంతో ఈ సినిమా యువతను ఆకట్టుకోవడం ఖాయమనే ధీమాతో ఉన్నారట. బెదురులంక హిట్ తో మళ్లీ సత్తా చాటాలని భావిస్తున్నాడు కార్తికేయ. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో తెలియాలంటే విడుదలయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే.