2022 లో పాన్ ఇండియా చిత్రాల హవా ఎక్కువగానే సాగింది. బాహుబలి చిత్రంతో ఈ పాన్ ఇండియా మోజు బూజుల పట్టుకుంది ఒక్కొక్కల్ని. ఇంకేముంది పాన్ ఇండియా మోజులో చాలా చిత్రాలే వచ్చాయి. అయితే అలా వచ్చిన అన్ని చిత్రాలు కూడా సత్తా చాటలేకపోయాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపాయి. అలా బాక్సాఫీస్ ను కుమ్మేసిన సినిమాల జాబితాలో ఈ ఏడాది మొదటి స్థానంలో KGF 2 ఉండగా రెండో స్థానంలో RRR నిలిచింది. ఇక ఆ తర్వాత స్థానాల్లో పొన్నియన్ సెల్వన్ – 1 , కమల్ హాసన్ విక్రమ్ , కాంతార చిత్రాలు ఉన్నాయి.
KGF 2: కన్నడ హీరో యష్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. లాజిక్కుకు మ్యాజిక్కుకు అందకుండా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఔరా ! అనిపించింది. ఓ కన్నడ సినిమా 2022 బాక్సాఫీస్ ను కుమ్మేయడమా ? అని షాకయ్యేలా చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్ గా KGF 3 రానుంది.
RRR : ఎన్టీఆర్ కొమరం భీం గా రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన RRR కు అసలు సిసలైన ట్రేడ్ మార్క్ ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో 1150 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక జపాన్ లో కూడా ఈ సినిమా రజనీకాంత్ ముత్తు రికార్డును 27 ఏళ్ల తర్వాత బద్దలు కొట్టి డబ్బింగ్ చిత్రాల్లో నెంబర్ 1 గా నిలిచింది.
విక్రమ్ : లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన చిత్రం ” విక్రమ్ ”. చాలా సంవత్సరాలుగా కమర్షియల్ హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు కమల్. సరిగ్గా అలాంటి సమయంలోనే వచ్చిన చిత్రం విక్రమ్. బాక్సాఫీస్ ను దున్నేసిన ఈ సినిమా ఏకంగా 450 కోట్లకు పైగా వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. అప్పుల్లో ఉన్న కమల్ హాసన్ ను మళ్ళీ ఒడ్డున పడేలా చేసింది.
పొన్నియన్ సెల్వన్ – 1: విక్రమ్ , కార్తీ , ఐశ్వర్యారాయ్ , త్రిష , జయం రవి వంటి భారీ తారాగణం కలిసి నటించిన చిత్రం ” పొన్నియన్ సెల్వన్ – 1” . మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రం కూడా నెగెటివ్ టాక్ తో కూడా భారీ వసూళ్లను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. దాంతో పొన్నియన్ సెల్వన్ – 2 పై దృష్టి సారించాడు మణిరత్నం.
కాంతార : కన్నడంలో ఓ చిన్న చిత్రంగా చేసిన సినిమా ” కాంతార ” . రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదట కన్నడంలో విడుదలై సంచలన విజయం సాధించింది. దాంతో వెంటనే పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసారు. విచిత్రం ఏంటంటే కాంతార విడుదలైన అన్ని భాషల్లో కూడా వసూళ్ల వర్షం కురిపించింది. పైన పేర్కొన్న చిత్రాలన్నీ స్టార్ లతో రూపొందినవి కావడంతో భారీ బడ్జెట్ చిత్రాలు అయ్యాయి. అలాగే భారీ స్టార్ కాస్టింగ్ చిత్రాలు కూడా. కానీ కాంతార మాత్రం కేవలం 15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన చిత్రం కావడం విశేషం.ఇక ఈ చిత్రం ఏకంగా 400 కోట్ల వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది.