
నందమూరి తారకరత్న అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దాంతో అతడు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ మృత్యుంజయస్వామి కి పూజలు నిర్వహించారు బాలయ్య. అలాగే 44 రోజుల పాటు అఖండ జ్యోతి వెలిగించే కార్యక్రమం ప్రారంభించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని బత్తలాపురంలో మృత్యుంజయ స్వామి దేవాలయం ఉంది. దాంతో తారకరత్న మృత్యువును జయించాలని ఈ పూజలు చేయిస్తున్నారు బాలయ్య.
ప్రస్తుతం తారకరత్న బెంగుళూర్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్యం ఇప్పుడు కాస్త మెరుగు పడింది. ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలపడంతో బాలయ్య బెంగుళూరు నుండి హైదరాబాద్ వచ్చాడు. గత వారం రోజులుగా బెంగుళూరులోనే ఉన్నాడు బాలయ్య. తారకరత్న కు చికిత్స అందించే అన్ని విషయాలు కూడా బాలయ్య దగ్గరుండి మరీ చూసుకున్నాడు. బాలయ్య కు కుటుంబం అంటే కుటుంబ సభ్యులు అంటే మక్కువ దాంతో తారకరత్న కోసం వారం రోజుల పాటు చాలా కష్టపడ్డాడు. బాలయ్య చూపించిన చొరవకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బాలయ్య పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.