మహానటులు నందమూరి తారకరామారావు అటు సినిమారంగంలో ఇటు రాజకీయ రంగంలో కూడా రారాజుగా వెలుగొందిన విషయం తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ తనని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రజల కోసం రాజకీయాలలోకి అడుగు పెట్టారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్.
ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు ఎన్టీఆర్. అందులో ఒకటి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం. 1982 సంవత్సరంలో చాలా గ్రామాల్లోని ప్రజలకు కనీసం ఒక్క పూట అయినా అన్నం తినలేని పరిస్థితి అంటే అతిశయోక్తి కాదు సుమా ! ఒకప్పుడు అన్నం తినే రోజు వచ్చిందంటే పెద్ద పండగే అని చెప్పాలి. అలాంటి ఘోరమైన పరిస్థితులు చాలా గ్రామాల్లో ఉండేవి. గడక , నూకల అన్నం తినేవాళ్ళు పేద ప్రజలు. అలాంటి వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలనే గొప్ప సంకల్పంతో ఎన్టీఆర్ తలపెట్టిన మహత్కార్యం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం.
ఈ పథకంతో ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీఆర్. 1989 వరకు ఈ పథకం ఎన్టీఆర్ కొనసాగించారు. 1989 లో ఓడిపోయారు. మళ్లీ 1994 లో అఖండ మెజారిటీ సాధించి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు ఎన్టీఆర్. ఆ సమయంలో కూడా రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని కొనసాగించారు ఎన్టీఆర్. ప్రజల మనస్సులలో నిలిచిన ఎన్టీఆర్ ను ….. పేద ప్రజలకు కడుపునిండా భోజనం చేసేలా చేసిన ఆ మహనీయుడి చిత్రాన్ని అదే బియ్యంతో బహు సుందరంగా రూపొందించారు. ఆ చిత్రాన్ని మీరూ తిలకించండి.