రెబల్ స్టార్ కృష్ణంరాజు నిజమైన రారాజు అంటూ కీర్తించారు సీనియర్ నటులు చంద్రమోహన్. తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన నటులు చంద్రమోహన్. హీరోగా , హాస్య నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , ఇలా అన్ని రకాల పాత్రలను పోషించి మెప్పించిన నటులు చంద్రమోహన్. ఇక చంద్రమోహన్ పక్కన హీరోయిన్ గా నటిస్తే తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతారు అనే సెంటిమెంట్ బలంగా ఉండేది అప్పట్లో. అది సెంటిమెంట్ మాత్రమే కాదు సుమా ! నిజం కూడా . చంద్రమోహన్ సరసన నటించిన పలువురు హీరోయిన్ లు ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్ లుగా తెలుగునాట ప్రభంజనం సృష్టించారు.
తాజాగా సీనియర్ నటులు చంద్రమోహన్ JSW & JaiSwaraajya కోసం కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్బంగా ఇటీవల పరమపదించిన రెబల్ స్టార్ కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కృష్ణంరాజు నిజంగానే రారాజు అని , ఆయనతో నేను ఎక్కువ సినిమాలు చేయలేదు కానీ చేసిన సినిమాల వరకు మాత్రం నాకు సంతృప్తి ఉంది. అలాగే ఆయన ఎక్కడుంటే అక్కడ అందరినీ ఒక చోటకు చేర్చి ఇంటి దగ్గరనుండి తీసుకొచ్చిన రకరకాల వంటకాలను నటీనటులందరికీ వడ్డించే ఏర్పాటు చేసేవారు. ఆ విషయంలో ఆయన్ని మించిన రాజు లేడంటే అతిశయోక్తి కాదు.
ఇక ఇప్పటి హీరోలైన ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ తదితర హీరోలతో నాకు మంచి అనుబంధం ఉంది. వాళ్లతో కలిసి పలు చిత్రాల్లో నటించాను. పెద్దలంటే గౌరవ భావం ఉన్న హీరోలు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు సీనియర్ నటులను ఇంటర్వ్యూ చేయడం , వాళ్ళను గౌరవించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ JSW & JaiSwaraajya అధినేతలు జగదీశ్ యలమంచిలి , డాక్టర్ శివకుమార్ ఆనంద్ లను అభినందించారు చంద్రమోహన్.