
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు , నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. కాస్ట్యూమ్స్ కృష్ణ తో దిల్ రాజుకు అనుబంధముంది. అసలు నిర్మాతగా దిల్ రాజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం కాస్ట్యూమ్స్ కృష్ణ కావడమే. దాంతో ఆయన మరణాన్ని తట్టుకోలేక పోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.
సినిమారంగంలో కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ లో పని చేసేవారు కాస్ట్యూమ్స్ కృష్ణ. పలు సూపర్ హిట్ చిత్రాలకు కాస్ట్యూమ్స్ చీఫ్ గా పనిచేశారు. అయితే అతడిలో మంచి నటుడు ఉన్నాడని గుర్తించి భారత్ బంద్ అనే చిత్రంలో విలన్ గా అవకాశం ఇచ్చారు దర్శకుడు కోడిరామకృష్ణ. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటుగా కాస్ట్యూమ్స్ కృష్ణకు చాలా మంచి పేరు వచ్చింది. దాంతో వరుసగా అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. దాంతో బిజీ నటుడు అయ్యారు.
ఇక ఇదే సమయంలో జగపతిబాబు హీరోగా పెళ్లి పందిరి అనే చిత్రం నిర్మించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాను దిల్ రాజు నైజాం లో పంపిణీ చేశారు. ఇంకేముంది భారీగా లాభాలు వచ్చి పడ్డాయి. ఒకవైపు నటుడిగా కొనసాగుతూనే మరోవైపు సినిమాలను కూడా నిర్మించారు. అయితే సినిమారంగంలో వచ్చిన మార్పులతో నటుడిగా అలాగే చిత్ర నిర్మాణం కూడా కొనసాగించడం కష్టమని భావించి దూరంగా ఉన్నారు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా తోడవడంతో చెన్నై లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కాస్ట్యూమ్స్ కృష్ణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.






