46 సంవత్సరాల మీనా నటిగా 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దాంతో చెన్నై మహానగరంలో మీనాకు ఘనమైన సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ , ఏపీ మంత్రి ఆర్కే రోజా తో పాటుగా పలువురు తమిళ , తెలుగు , మలయాళ నటీనటులు హాజరవడం విశేషం. తెలుగు కుటుంబానికి చెందిన మీనా తల్లిదండ్రులు తమిళనాడులో స్థిరపడ్డారు. 1976 సెప్టెంబర్ 16 న దురైరాజ్ – రాజమల్లిక దంపతులకు జన్మించింది మీనా. తండ్రి తెలుగువ్యక్తి కాగా తల్లి కేరళకు చెందిన వారు కావడం విశేషం.
మీనా తన 6 వ ఏటనే బాలనటిగా చిత్ర రంగ ప్రవేశం చేసింది. శివాజీ గణేశన్ హీరోగా నటించిన ” నెంజన్గల్ ” అనే తమిళ చిత్రంతో బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సిరివెన్నెల చిత్రంతో పాటుగా పలు చిత్రాల్లో బాలనటిగా నటించింది మీనా. ఆ తర్వాత హీరోయిన్ గా రాజేంద్ర ప్రసాద్ సరసన ” నవయుగం ” అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది.
అయితే బ్లాక్ బస్టర్ కొట్టింది మాత్రం విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ” చంటి ” చిత్రంతోనే. 1992 లో వచ్చిన ఆ చిత్రం దక్షిణ భారత దేశ చలన చిత్ర రికార్డులను అన్నింటినీ బద్దలుకొట్టి కొత్త చరిత్ర సృష్టించింది. దాంతో హీరోయిన్ గా మీనా స్టార్ స్టేటస్ అందుకుంది. ఇక ఆ తర్వాత మీనా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. రజనీకాంత్ , కమల్ హాసన్ లాంటి స్టార్ ల చిత్రాల్లో బాలనటిగా నటించిన మీనా మళ్ళీ వాళ్ళ సరసన హీరోయిన్ గా నటించి మెప్పించడం విశేషం.
తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ చిత్రాల్లో దాదాపు 200 సినిమాల్లో నటించడం విశేషం. రజనీకాంత్ , కమల్ హాసన్ , చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున , డాక్టర్ రాజశేఖర్ , మోహన్ లాల్ , జయరాం , మమ్ముట్టి , సురేష్ గోపి తదితర సీనియర్ హీరోల సరసన నటించింది మీనా.
గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలను పోషించి దాదాపు పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇక 2009 లో విద్యాసాగర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లాడింది. వాళ్లకు ఒక పాప నైనిక . ఈ పాప కూడా బాలనటిగా కెరీర్ ప్రారంభించడం విశేషం. తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి హీరోగా నటించిన ” తేరి ” చిత్రంలో విజయ్ కూతురిగా నటించింది నైనిక.
అయితే దురదృష్టవశాత్తు 2022 లో మీనా భర్త విద్యాసాగర్ కరోనా మహమ్మారితో మరణించాడు. దాంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది మీనా. సెకండ్ ఇన్నింగ్స్ తో తన బాధలను మర్చిపోవడానికి ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మీనా సినిమాల్లోకి ప్రవేశించి 40 ఏళ్ళు అవుతుండటంతో నాలుగు దశాబ్దాల నటజీవితం గురించి ప్రస్తావిస్తూ ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం విశేషం.