ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ ప్రయాణిస్తున్న కారు భారీ ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎలాంటి పెద్ద గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకుంది రంభ.
తన పిల్లలను తీసుకొని స్కూల్ లో దించడానికి ఈరోజు ఉదయం కారులో బయలుదేరింది రంభ. అయితే అకస్మాత్తుగా ఓ కారు వేగంగా దూసుకువచ్హి రంభ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దాంతో రంభ ఒక్కసారిగా షాక్ కు గురయ్యిందట. ఈ యాక్సిడెంట్ లో తన కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి. దాంతో తన కూతుర్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తోంది.
రంభ 90 వ దశకంలో తెలుగునాట స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ , మోహన్ బాబు , డాక్టర్ రాజశేఖర్, సుమన్ తదితర హీరోల సరసన నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది.