మహానటులు అక్కినేని నాగేశ్వరరావు జయంతి ఈరోజు. 1923 సెప్టెంబర్ 20 న కృష్ణా జిల్లా రామాపురం అనే గ్రామంలో అక్కినేని వెంకట రత్నం – పున్నమ్మ దంపతులకు జన్మించారు అక్కినేని నాగేశ్వరరావు. పేద కుటుంబంలో జన్మించడంతో చదువు పెద్దగా చదువుకోలేకపోయారు. అయితే నాటకాలలో మాత్రం బాగా రాణించారు. ముఖ్యంగా మహిళా వేషధారణలో అదరగొట్టారు అక్కినేని. ఆ తర్వాత సినిమారంగంలోకి అడుగుపెట్టి అగ్ర కథానాయకుడిగా అప్రతిహతమైన విజయాలను అందుకున్నారు.
అక్కినేని స్టార్ గా వెలుగొందుతున్న సమయంలోనే నందమూరి తారకరామారావు చిత్ర రంగప్రవేశం చేసారు. ఎన్టీఆర్ ఆజానుబాహుడు దాంతో మరొక హీరో అయితే కృంగిపోయేవారు అనే చెప్పాలి. కానీ అక్కినేని మాత్రం ఛాలెంజ్ గా తీసుకొని తన బలం – బలహీనత ఏంటో తెలుసుకొని అలాంటి చిత్రాలను మాత్రమే చేసి తిరుగులేని ప్రజాధారణ పొందారు.
ఎన్టీఆర్ చారిత్రాత్మక , పౌరాణిక చిత్రాలతో సంచలనం సృష్టిస్తుంటే అక్కినేని మాత్రం జానపద , సాంఘిక చిత్రాలతో ప్రభంజనం సృష్టించారు. ముఖ్యంగా 60- 70 వ దశకంలో సాంఘిక చిత్రాలతో అప్పటి యువతలో విపరీతమైన పాపులారిటీ సంపాదించారు అక్కినేని. ఇక ప్రేమ కథా చిత్రాలకు , విషాద భరితమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. 75 సంవత్సరాల పాటు నటననే వృత్తిగా సాగించిన మహనీయుడు అక్కినేని. క్యాన్సర్ తో పోరాడుతూ కూడా ”మనం ” వంటి క్లాసిక్ చిత్రంలో నటించి నటన పట్ల తనకున్న మక్కువ చాటుకున్నారు. ఈరోజు సెప్టెంబర్ 20 …….. మహానటులు అక్కినేని నాగేశ్వరరావు 99 వ జయంతి. ఆ సందర్బంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఘన నివాళి అందిస్తోంది JSW & JaiSwaraajya.tv.