
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్నాడు. ఈమేరకు ఈరోజు అధికారిక ప్రకటన చేసారు మేకర్స్. అర్జున్ రెడ్డి చిత్రంతో ప్రభంజనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా అదే చిత్రాన్ని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసాడు. అక్కడ కూడా కబీర్ సింగ్ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది.
కట్ చేస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తన తదుపరి సినిమాను ఓకే చేసాడు. అది చాలదన్నట్లుగా రణబీర్ కపూర్ తో యానిమల్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక ఇప్పుడు పనిలో పనిగా అల్లు అర్జున్ తో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
దాంతో తన తదుపరి చిత్రం ఏ దర్శకుడితో చేయాలి అని తీవ్రంగా ఆలోచించిన సమయంలో సందీప్ రెడ్డి వంగా తీసుకొచ్చిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను టి. సిరీస్ నిర్మించనుంది. అల్లు అర్జున్ – సందీప్ రెడ్డి వంగా – టి. సిరీస్ ల కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప 2 తర్వాత సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయనున్నాడు.