స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన సంచలన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించిన సంగతి తెలిసిందే. గత ఏడాది 2021 డిసెంబర్ 17 న విడుదలైన పుష్ప రికార్డుల మోత మోగించింది.
పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన పుష్ప ప్రపంచ వ్యాప్తంగా 345 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ భాషల్లో భారీ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించగా కీలక పాత్రల్లో సునీల్ , ఫహాద్ ఫాజిల్ , అనసూయ తదితరులు నటించారు. ఇక ఊ అంటావా మావా ఊఊ అంటావా అంటూ ఐటమ్ సాంగ్ తో సమంత కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. పుష్ప మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రస్తుతం రెండో భాగాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల అయి ఏడాది పూర్తి కావడంతో ఆ సంబరాలను చేసుకుంటున్నారు పుష్ప యూనిట్.