టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. స్టూవర్ట్ పురం దొంగలు చిత్రాన్ని నిర్మించిన విఎస్ రామిరెడ్డి అనారోగ్యంతో మరణించారు. గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి చెందిన రామిరెడ్డి సినిమాలపై మక్కువతో చిత్ర రంగప్రవేశం చేసారు. ప్రముఖ దర్శకులు సాగర్ దర్శకత్వంలో భాను చందర్ , నాజర్ , బ్రహ్మానందం , లిజి , చరణ్ రాజ్ తదితరులు నటీనటులుగా ” స్టూవర్ట్ పురం దొంగలు ” అనే చిత్రాన్ని నిర్మించారు.
1991 లో విడుదలైన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఆ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు నిర్మించారు. అయితే అవి అంతగా విజయం సాధించలేకపోయాయి. దాంతో సినిమా రంగానికి దూరంగా ఉంటున్నారు. సెప్టెంబర్ 28 న అనారోగ్యంతో స్వగ్రామంలోనే మరణించారు రామిరెడ్డి. దాంతో పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.