నటసింహం నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రంలో ముఖ్యమంత్రిగా పవర్ ఫుల్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి గా నటిస్తున్న బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా నటించడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే పరశురామ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాగా ఆ సినిమాలోనే ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడట బాలయ్య.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట చిత్రాన్ని చేసాడు దర్శకుడు పరశురామ్. సర్కారు వారి పాట మంచి హిట్ అయ్యింది కానీ రికార్డుల మోత మోగించలేదు. మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా పెద్ద హిట్ అయ్యుండేదని అభిప్రాయపడ్డారు. ఆ సినిమా సంగతి పక్కన పెడితే …….. బాలయ్యను కలిసి కథ చెప్పాడట పరశురామ్. ఆ కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాలయ్య.
ఈ సినిమా బహుశా మేలో ప్రారంభం కావచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే అనిల్ రావిపూడి సినిమా ఏప్రిల్ వరకు పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అంటే ఆ సినిమా అయ్యాక పరశురామ్ సినిమా పట్టాలెక్కనుంది. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందట. కుర్ర హీరోలతో పోటీ పడుతూ బాలయ్య వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు.