
నటసింహం నందమూరి బాలకృష్ణ మాట్లాడే సమయంలో తరచుగా ఏదో ఒక మాట స్లిప్ అవుతూనే ఉంటాడు. ఇలా పలుమార్లు జరిగింది…… ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి టంగ్ స్లిప్పయ్యాడు బాలయ్య. వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో మాట్లాడిన సమయంలో అక్కినేని ….. తొక్కినేని అంటూ టంగ్ స్లిప్పయ్యాడు. ఇక ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇక అక్కినేని వంశాభిమానులు బాలయ్య వ్యవహారశైలి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ను టార్గెట్ చేసిన అక్కినేని అభిమానులు తమ బాధను , ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. అయితే ఈ విషయం పై అక్కినేని నాగార్జున కానీ అక్కినేని కుటుంబ హీరోలు కానీ స్పందించలేదు. వాళ్ళ దృష్టికి ఈ విషయం వెళ్లి ఉంటుంది కానీ తమ అసంతృప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారట నాగార్జున అండ్ కో.
గతకొంత కాలంగా అక్కినేని – నందమూరి కుటుంబాల మధ్య ఆశించిన స్థాయిలో బంధాలు – అనుబంధాలు లేకుండాపోయాయి. అయితే ఎన్టీఆర్ – అక్కినేని ల మధ్య మంచి అనుబంధం ఉండేది. వాళ్లిద్దరి మధ్య కూడా కొన్ని మనస్పర్థలు వచ్చినప్పటికీ అవి సమసిపోయాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు నందమూరి – అక్కినేని. ఇక అదే వారసత్వాన్ని బాలయ్య – నాగార్జున కూడా కొనసాగిస్తున్నారు కానీ ఎన్టీఆర్ – అక్కినేని ల మధ్య ఉన్నంత సాన్నిహిత్యం మాత్రం బాలయ్య – నాగార్జున ల మధ్య లేదనే చెప్పాలి.