
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సంచలన చిత్రం ” లెజెండ్ ”. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ , వారాహి చలనచిత్రం సంయుక్తంగా నిర్మించింది. అనిల్ సుంకర , రామ్ ఆచంట , సాయి కొర్రపాటి , ఆచంట గోపి ఈ సినిమాను నిర్మించారు. 2014 మార్చి 28 న భారీ ఎత్తున విడుదలైంది లెజెండ్.
రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను దున్నేసింది. 40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లెజెండ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 90 కోట్ల వసూళ్లను సాధించింది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం నందమూరి అభిమానులను విశేషంగా అలరించింది. బాలయ్య చెప్పిన డైలాగ్స్ థియేటర్ లలో డైనమైట్ లలా పేలాయి.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు , నేపథ్య సంగీతం లెజెండ్ చిత్రాన్ని మరో లెవల్ లో నిలబెట్టింది. ఇక జగపతి బాబు అంటే ఫ్యామిలీ చిత్రాల హీరో …… ఒకప్పటి శోభన్ బాబు అన్నమాట. అలాంటి జగపతి బాబును ఈ చిత్రంలో విలన్ గా చూపించి సక్సెస్ అయ్యాడు బోయపాటి. జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ పీక్స్ చేరుకోవడానికి లెజెండ్ చిత్రానిది కీలక పాత్ర.
బాలయ్య సరసన అందాల ముద్దుగుమ్మలు రాధికా ఆప్టే , సోనాలి చౌహన్ నటించారు. ఇక కీలక పాత్రల్లో రావు రమేష్, ఈశ్వరి రావు , సుమన్ , కళ్యాణి , సుహాసిని , చలపతి రావు , బ్రహ్మానందం , హంసా నందిని , జయప్రకాశ్ రెడ్డి , బ్రహ్మాజీ , ఎల్బీ శ్రీరామ్ , వైజాగ్ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 9 ఏళ్ళు పూర్తయ్యింది. దాంతో బాలయ్య అభిమానులు మరోసారి పండగ చేసుకుంటున్నారు. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో మొదటిసారిగా సింహా రాగా అది రికార్డుల మోత మోగించింది. కట్ చేస్తే రెండో సినిమాగా లెజెండ్ వచ్చి ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత అఖండ చిత్రంతో హ్యాట్రిక్ కూడా కొట్టారు. ఇక మరోసారి నాలుగో సినిమాకు రెడీ అవుతున్నారు బాలయ్య – బోయపాటి.