
మాస్ మహారాజ్ రవితేజ నటించిన ” ధమాకా ” నిఖిల్ హీరోగా నటించిన ” 18 పేజెస్ ” చిత్రాలు ఈనెల 23 న విడుదల అవుతున్నాయి. దాంతో ఈ ఇద్దరు హీరోలలో హిట్ కొట్టేది ఎవరు ? అనే ఆసక్తి మొదలైంది. గతకొంత కాలంగా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రాలన్నీ ఘోర పరాజయం పాలయ్యాయి. క్రాక్ చిత్రం ఆ పరాజయాలకు ఫుల్ స్టాప్ పెట్టింది అని అనుకుంటే క్రాక్ తర్వాత వచ్చిన చిత్రాలు కూడా ఘోరంగా ప్లాప్ అయ్యాయి దాంతో ధమాకా పై రవితేజ భారీగా ఆశలు పెట్టుకున్నాడు.
నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల నటించింది. ఇప్పటికే టీజర్ , ట్రైలర్ అలాగే పాటలతో ధమాకా చిత్రం పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. తప్పకుండా కమర్షియల్ హిట్ కొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నారు ధమాకా బృందం.
ఇక నిఖిల్ విషయానికి వస్తే ……. కార్తికేయ 2 చిత్రంతో కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులను కూడా అలరించాడు. చిన్న చిత్రంగా వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా చిత్రంగా విడుదలై 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించగా బ్లాక్ బస్టర్ అయ్యింది ఆ చిత్రం. కట్ చేస్తే తాజాగా 18 పేజెస్ అంటూ మళ్ళీ అనుపమ తోనే రొమాన్స్ చేసాడు నిఖిల్.
ఇక ఈ 18 పేజెస్ చిత్రం యూత్ కి కావాల్సిన అన్ని మసాలాలు కలగలిపిన సినిమా కావడంతో తప్పకుండా యూత్ ని అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈనెల 23 న అటు రవితేజ సినిమా ఇటు నిఖిల్ సినిమా రెండు కూడా విడుదల అవుతున్నాయి. దాంతో ఈ రెండు చిత్రాలలో ఏది హిట్ అవుతుందనే ఆసక్తి నెలకొంది. రెండు జానర్లు కూడా వేరు……. అలాగే హీరోల రేంజ్ కూడా వేరు …. కానీ ప్రేక్షకులకు నచ్చాలే కానీ జానర్లను , హీరోల రేంజ్ లను పట్టించుకునే ప్రసక్తి లేదు కాబట్టి డిసెంబర్ 23 న బాక్సాఫీస్ బాస్ అయ్యేది ఎవరు ? అనే ఉత్సుకత అయితే నెలకొంది.