
హీరో అక్కినేని అఖిల్ బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు దాంతో తెలుగు వారియర్స్ ఘనవిజయం సాధించింది. సినీ ప్రముఖులు అందరూ కలిసి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ( సీసీఎల్ ) ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లు నిన్నటి రోజున ప్రారంభం కాగా మొదటి మ్యాచ్ లో కేరళ స్టార్స్ తో తెలుగు వారియర్స్ పోటీ పడింది. ఇక అఖిల్ విధ్వంసకర బ్యాటింగ్ తో తెలుగు వారియర్స్ అద్భుత విజయం సాధించింది.
అఖిల్ కేవలం 30 బంతుల్లో 91 పరుగులను చేసి ఔరా అనిపించాడు. యంగ్ హీరో ప్రిన్స్ 23 బంతుల్లో 45 పరుగులు చేసాడు. తెలుగు వారియర్స్ 10 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 154 పరుగులు చేయగా కేరళ స్టార్స్ 10 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి కేవలం 98 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో టాలీవుడ్ స్టార్స్ సంచలన విజయం సాధించింది.
అఖిల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ అవార్డు ను సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా అఖిల్ అందుకోవడం విశేషం. అఖిల్ క్రికెట్ మ్యాచ్ బాగా ఆడతాడు అనే విషయం తెలిసిందే. అఖిల్ బ్యాటింగ్ తో అదరగొడుతుంటే ఈలలు , గోలలతో స్టేడియం దద్దరిల్లిపోయింది.