గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని తలచుకొని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు ప్రముఖ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్. నా కెరీర్ ప్రారంభంలో నేను రాసిన చాలా పాటలను ఎస్పీ బాలు గారు పాడారు. ఆయన పాడటం వల్లే నాపాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయని , దాంతో నేను ఈ స్థాయికి చేరుకున్నానని , నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి , శక్తి బాలు గారు అంటూ ఆయన పట్ల తనకున్న భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.
నేను మూడు వేలకు పైగా పాటలు రాయగలిగానంటే అందుకు బాలు గారు అందించిన ప్రోత్సాహమే కారణం అంటూ గద్గద స్వరంతో అన్నారు చంద్రబోస్. ఎస్పీ బాలు దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో పాటలు పాడారు. అద్భుతమైన పాటలతో దేశ వ్యాప్తంగా ఉర్రూతలూగించారు. అన్ని భాషల్లో కలిపి 40 వేలకు పైగా పాటలను ఆలపించి చరిత్ర సృష్టించిన మహనీయుడు. ఈటీవీ లో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు వేలాదిమంది గాయనీ గాయకులు కావడానికి దోహదపడిన మహాశక్తి ఎస్పీ బాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సృష్టించిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా వేలాది మంది సింగర్స్ గా రాణిస్తున్నారు…… యంగ్ టాలెంట్ విశ్వవ్యాప్తమయ్యింది.
అయితే కరోనా మహమ్మారి కారణంగా 2020 సెప్టెంబర్ 25 న మరణించారు. బాలు మరణం యావత్ చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా తీవ్ర షాక్ కి గురిచేసింది. బాలు మరణంతో శోక సంద్రమే అయ్యింది చిత్ర పరిశ్రమ.
తాజాగా యు బ్లడ్ యాప్ గురించి , ఆ యాప్ ప్రత్యేకత గురించి వెల్లడించిన సమయంలో బాలు గారిని తలుచుకున్నారు చంద్రబోస్ . JSW & Jaiswaraajya కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఇక దీపావళి సందర్బంగా టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు చంద్రబోస్.