
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ” RC 15” . ప్రముఖ దర్శకులు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఈ సినిమా ప్రారంభం అయ్యింది అయితే అడపా దడపా మాత్రమే షూటింగ్ జరుపుకుంటోంది. దానికి కారణం కమల్ హాసన్ తో ఇండియన్ 2 చిత్రాన్ని శంకర్ ఇదే సమయంలో రూపొందిస్తుండటమే !
ఇక చరణ్ సినిమా విషయానికి వస్తే …….. తాజాగా వైజాగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. అయితే ఇటీవలే రాజమండ్రి షెడ్యూల్ ను పూర్తి చేసాడు చరణ్. పెద్ద ఎత్తున జూనియర్ ఆర్టిస్ట్ లతో రాజమండ్రి గోదావరి పరిసర ప్రాంతాల్లో సెట్ వేసి చిత్రీకరించారు శంకర్. చరణ్ ఓ రాజకీయ పార్టీ నాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రానుందట. ఇక ఇదే సినిమాలో శ్రీకాంత్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ భామ కియారా అద్వానీ చరణ్ సరసన నటిస్తోంది. ఇంతకుముందు చరణ్ – కియారా ” వినయ విధేయ రామ ” చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. మరి ఈ సినిమా ఏమౌతుందో ? అనే టెన్షన్ మొదట్లో ఉండేది. అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది దిల్ రాజు కాబట్టి అలాగే శంకర్ దర్శకుడు కాబట్టి ఇలాంటి సెంటిమెంట్స్ , అనుమానాలు అవసరం లేదని అంటున్నారు.






