
మెగాస్టార్ చిరంజీవి , లేడీ అమితాబ్ విజయశాంతి జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం గ్యాంగ్ లీడర్ 32 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈనెల 11 న గ్యాంగ్ లీడర్ చిత్రం భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 1991 లో విడుదలైన గ్యాంగ్ లీడర్ సంచలన విజయం సాధించింది. వసూళ్ల వర్షం కురిపించింది. విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రవీంద్ర నాథ్ చౌదరి నిర్మించారు. ఇక ఈ చిత్రానికి బప్పీలహిరి అందించిన పాటలు ఇప్పటికి మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఈ చిత్రంలోని అన్ని పాటలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
సెంటిమెంట్, యాక్షన్ , ఎంటర్ టైన్ మెంట్ ఇలా అన్ని అంశాలను కలగలిపి రూపొందించిన సినిమా కావడంతో ప్రేక్షకులు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. చిరంజీవి, విజయశాంతి , నిర్మలమ్మ , మురళీమోహన్, సుధ , సుమలత, శరత్ కుమార్ , రావుగోపాల రావు , అల్లు రామలింగయ్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఇక ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలను మళ్లీ మళ్లీ విడుదల చేయడం సర్వసాధారణంగా మారింది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల చిత్రాలు విడుదలై మంచి వసూళ్లు సాధించాయి. దాంతో ఆ కోవలోనే గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని ఈనెల 11 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.