మెగాస్టార్ చిరంజీవి – కళాతపస్వి కె. విశ్వనాథ్ కాంబినేషన్ లో మొత్తంగా మూడు చిత్రాలు వచ్చాయి. అందులో మొదటగా” శుభలేఖ ”అనే చిత్రం రాగా ఇది సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఆ తర్వాత” స్వయంకృషి” అనే సినిమా చేసారు. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ముచ్చటగా మూడో సినిమాగా ” ఆపద్భాంధవుడు ” వచ్చింది. అయితే మొదటి రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కానీ ఆపద్భాంధవుడు మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
చిరంజీవి అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరో …… ఆ సమయంలో చేసిన చిత్రమే ” శుభలేఖ ”. చిరంజీవి – సుమలత జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. చిరంజీవి , సుమలత , శుభలేఖ సుధాకర్ , తులసి , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , రమణమూర్తి , రాళ్ళపల్లి , సాక్షి రంగారావు , నిర్మలమ్మ , వంకాయల సత్యనారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి గొల్లపూడి మారుతీరావు సంభాషణలు అందించాడు. ఇక కెవి మహదేవన్ సంగీతం అందించాడు. ఈ సినిమా చిరంజీవి కెరీర్ కు మంచి ఊపును తెచ్చింది.
ఇక సుప్రీం హీరోగా పక్కా మాస్ మసాలా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఎదిగిన సమయంలో అంటే 1987 లో విడుదలైన స్వయంకృషి సంచలన విజయం సాధించింది. చిరంజీవి లాంటి మాస్ హీరో చెప్పులు కుట్టుకునే వ్యక్తిగా జీవించి ఆ పాత్రకు ప్రాణం పోసాడు. మెగాస్టార్ కు నటన పరంగా చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం స్వయంకృషి. అలాగే ఉత్తమ నటుడి నంది అవార్డ్ తో పాటుగా మరికొన్ని అవార్డులను తెచ్చిపెట్టిన చిత్రం స్వయంకృషి. ఇక ఈ చిత్రంలోని పాటలు కూడా చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పటికి కూడా ఈ చిత్రంలోని పాటలు మారుమ్రోగుతూనే ఉన్నాయి.
ఇక ముచ్చటగా మూడో చిత్రంగా ఈ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ” ఆపద్బాంధవుడు ”. ఈ చిత్రంలోని పాటలు కూడా బాగున్నాయి. చిరంజీవికి నటుడిగా మంచి పేరు వచ్చింది. అయితే కమర్షియల్ గా విజయం సాధించలేదు. 1992 నాటికి చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగాడు. ఆ సమయంలో చిరంజీవి మరింతగా కమర్షియల్ హీరో కావడం వల్లో లేదా మరో కారణమో కానీ మొత్తానికి ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మొత్తానికి విశ్వనాథ్ కు బాగా ఇష్టమైన నటుడు చిరంజీవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో జయాపజయాలకు అతీతంగా విశ్వనాథ్ – చిరంజీవి ల బంధం కొనసాగింది.