ప్రముఖ దర్శకులు కాశీ నాథుని విశ్వనాథ్ ( 92 ) అనారోగ్యంతో మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కె. విశ్వనాథ్ నిన్న అర్ధరాత్రి 12 గంటలకు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. 92 ఏళ్ల వయసున్న విశ్వనాథ్ మళ్లీ కోలుకొని ఇంటికి తిరిగి వస్తారని భావించారు కుటుంబ సభ్యులు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో ఫిబ్రవరి 2 న అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. శంకరాభరణం సినిమా రిలీజ్ అయిన రోజు ఫిబ్రవరి 2 కాగా అదే రోజున కె. విశ్వనాథ్ మరణించడం గమనార్హం. కె. విశ్వనాథ్ ను దర్శకుడిగా నిలిచేలా చేయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసిన సినిమా శంకరాభరణం కావడం విశేషం.
సుదీర్ఘ మైన ప్రయాణంలో 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అన్ని సినిమాలు కూడా తెలుగింటి సంప్రదాయాలను తెలియజెప్పేలా చేసినవే కావడం గమనార్హం. హిందు సంస్కృతిని , సంప్రదాయాలను వ్యక్తీకరిస్తూ సాగాయి విశ్వనాథ్ సినిమాలు. విశ్వనాథ్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వనాథ్ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేయాలనే ఆలోచనలో ఉంది.