
అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తో ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి వంటి చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు అదే చిత్రాన్ని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా ప్రభంజనం సృష్టించాడు. ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించి సంచలనం సృష్టించాడు.
ఇక ఇప్పుడేమో డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. స్పిరిట్ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా సినిమా అంటే అంచనాలు స్కై లెవల్లో ఉండటం ఖాయం. దాంతో ఆ అంచనాలకు తగ్గట్లుగానే ప్రభాస్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాస్తున్నానని స్పష్టం చేసాడు ఈ దర్శకుడు. రా అండ్ రస్టిక్ గా ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా సినిమా ఉండనుందట.
ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. రణబీర్ కపూర్ కు చాకోలెట్ బాయ్ అనే ఇమేజ్ ఉంది. దాన్ని యానిమల్ చిత్రంతో కంప్లీట్ గా మార్చే పనిలో పడ్డాడట సందీప్ రెడ్డి వంగా. ఒకవైపు యానిమల్ సినిమా చేస్తూనే మరోవైపు ప్రభాస్ తో చేయబోయే స్క్రిప్ట్ గురించి చర్చలు సాగిస్తున్నాడు.