
‘ఒక మరుపురాని దృశ్యం
జీవితకాల జ్ఞాపకంగా మిగిలిపోవాలంటే
అది ఫొటోగ్రఫీ ద్వారా మాత్రమే సాధ్యం..”
ఫోటోగ్రఫీకి ఉన్న పవర్ అలాంటిది..మనం లేక పోయినా మన జ్ఞాపకాలను మనవాళ్లకు అందించేది ఈ దృశ్యీకరణే..అలాంటి దృశ్యీకరణ విద్యలో ఒక జీవిత కాలం గడపటంఅంటే అదొక వరం..అలాంటి వరం పొందారు డాక్టర్ శివకుమార్..
డాక్టర్ శివకుమార్ ఆనంద్ ……. తెలంగాణ ప్రాంతంలోని వలస జీవుల జిల్లాగా పేరుగాంచిన పాలమూరుకు చెందిన బిడ్డ. తండ్రి ఓ బడిపంతులు అయినప్పటికీ బహుభాషా కోవిదుడు…..మంచి పండితులు. తెలుగు , హిందీ , సంస్కృతం మరియు ఉర్దూ నాలుగు భాషల్లో కూడా కవితలు రాసేవారు. పలు కవి సమ్మేళనాలలో పాల్గొనేవారు. స్వంతంగా భగవద్గీతలోని 18 అధ్యాయాలను సంస్కృతం నుండి హిందీలోకి తర్జుమా చేసిన మహాపండితులు. ఉద్యోగ నిమిత్తం పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి , దేవరకద్ర , అభంగపట్నం లలోని పాఠశాలల్లో పనిచేసారు. రిటైర్ అయ్యే ముందు పాలమూరుకు వచ్చి స్థిరపడ్డారు. శివకుమార్ ఆనంద్ కుటుంబం పెద్ద కుటుంబం. ఒక అక్క , ఇద్దరు తమ్ముళ్లు , నలుగురు చెల్లెల్లతో కలిపి మొత్తం ఎనిమిది మంది. అయితే తమ్ముళ్ళిద్దరూ చిన్న వయసులోనే చనిపోయారు. ఇంటికి పెద్ద కొడుకు కావడంతో ఆ ఇంటికి పెద్ద దిక్కు అయ్యారు శివకుమార్ ఆనంద్. అక్కతో పాటుగా నలుగురు చెల్లెళ్ళను కంటికి రెప్పలా చూసుకున్నారు.
డాక్టర్ శివకుమార్ ఆనంద్ విద్యాభ్యాసం అంతా పాలమూరులోనే జరిగింది. డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టారు శివకుమార్ ఆనంద్ . సొంత ఊరుని , స్వరాష్ట్రాన్ని వదిలి , MSC జువాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం మహారాష్ట్ర లోని మరాట్వాడా యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ 1979 నుండి 1981 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి , ఆ వెంటనే PhD లో చేరారు. 1981 నుండి 1984 మధ్యకాలంలో PhD పూర్తి చేసి సంచలనం సృష్టించారు. ఆ సమయంలో కేవలం 24 ఏళ్ల వయసులోనే…… మరాట్వాడా యూనివర్సిటీ చరిత్రలోనే పిన్న వయసులో డాక్టరేట్ అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా సంచలనం సృష్టించారు డాక్టర్ శివకుమార్ ఆనంద్.
డాక్టరేట్ అందుకున్న తర్వాత శివకుమార్ ఆనంద్ రీసెర్చ్ గైడ్ డాక్టర్ జీకే కులకర్ణి ఫర్ దర్ రీసెర్చ్ కోసం అమెరికా వెళ్లారు. అయితే ఆయన అమెరికా వెళ్లిన తర్వాత శివకుమార్ ఆనంద్ ను కూడా రమ్మని ఆహ్వానించారట. అప్పట్లో అమెరికా వెళ్లడం పట్ల అంతగా ఆసక్తి లేకపోవడంతో ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించి ఇక్కడే ఉద్యోగ ప్రయత్నం చేసారు. అయితే ఆశించిన స్థాయిలో ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రాలేదు. డాక్టర్ శివకుమార్ ఆనంద్ కళాకారుడు కావడంతో పెయింటింగ్స్ అద్భుతంగా వేసేవారు.దాంతో ఆ కళను ఇతివృత్తంగా చేసుకొని ఔరంగాబాద్ లో హోర్డింగ్ బిజినెస్ ప్రారంభించారు. తానే ఆ హోర్డింగ్స్ కు డిజైన్ వేసి 20- 30 ఫీట్స్ గల పెద్ద పెద్ద హోర్డింగ్స్ ను అర్ధరాత్రుళ్లు కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో పెయింటింగ్ చేసేవారు.
అయితే శరాఘాతంలా అనుకోని ఓ దుర్వార్త వినాల్సి వచ్చింది. 1986 లో నాన్నగారు చనిపోయారనే వార్త శివకుమార్ ఆనంద్ ను షాక్ కు గురిచేసింది. తండ్రి మరణం ఒకవైపు , కుటుంబ బాధ్యత మరోవైపు …… బంధుమిత్రుల సూటి పోటి మాటలు మరోవైపు దాంతో తన బాధ్యతను గుర్తెరిగి ఔరంగాబాద్ ను వదిలేసి, తిరిగి వలస జీవుల జిల్లా అయిన పాలమూరు బాట పట్టారు డాక్టర్ శివకుమార్ ఆనంద్.

అక్కకు అలాగే నలుగురు చెల్లెళ్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత మీద పడటంతో చిన్న వయసులోనే ఆ బరువు బాద్యతలను మోయడానికి మానసికంగా సిద్ధమయ్యారు. అందుకోసం డబ్బు సంపాదించడమే మార్గం కాబట్టి తండ్రి చనిపోయిన ఆరు నెలల తర్వాత పాలమూరు నుండి హైదరాబాద్ కు పయనమయ్యారు డాక్టర్ శివకుమార్ ఆనంద్.
తన కాళ్ళ మీద తాను నిలబడాలనే ప్రయత్నంలో ఒక స్నేహితుడు డి. రవీందర్ రెడ్డి ప్రోద్బలంతో 1998 లో JNTU హైదరాబాద్ లో ఫోటోగ్రఫీ కోర్స్ లో జాయిన్ అయ్యారు. అప్పట్లో మొత్తం భారతదేశంలో ఒక్క JNTUలో తప్ప మరెక్కడా ఫోటోగ్రఫీ కోర్స్ లేదు. దాంతో ఆ కోర్స్ చేయడానికి పెద్ద ఎత్తున పోటీ ఉండేది. మొత్తం 10 సీట్లకు గాను దేశ వ్యాప్తంగా విపరీతమైన పోటీ ఉండేది. కాగా అంతటి పోటీని తట్టుకొని నేషనల్ లెవల్లో 6 వ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించారు. ఫోటోగ్రఫీ కోర్స్ పూర్తి చేసిన తర్వాత శివకుమార్ ఆనంద్ జీవితంలో అరుదైన సంఘటన జరిగింది. అదే ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పింది. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు దగ్గర పర్సనల్ ఫోటోగ్రాఫర్ గా కొంతకాలం పనిచేసే అదృష్టం శివకుమార్ ఆనంద్ ని వరించింది. అన్న నందమూరి తారకరామారావు దగ్గర పనిచేయడంతో క్రమశిక్షణలో మరింతగా రాటుదేలారు.

అదే సమయంలో ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్ట్ గా ఆనాటి ప్రముఖ పత్రికలైన డెక్కన్ క్రానికల్ , ఆంధ్రభూమి , ఇండియన్ ఎక్స్ ప్రెస్ , ది వీక్ మ్యాగజైన్ , ఇండియా టుడే లలో పనిచేసారు. అలాగే సినిమా పత్రికలకు కూడా ఫోటో జర్నలిస్ట్ గా సేవలందించారు. అంతేకాదు అప్పట్లో బుల్లితెరపై సంచలనం సృష్టించిన ఆగమనం అనే సీరియల్ కు రెండేళ్లపాటు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసారు.నటులు శరత్ బాబు చాలా బిజీ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆగమనం అనే సీరియల్ లో నటించడం అప్పట్లో సంచలన వార్తగా నిలిచింది. కాగా ఆ సీరియల్ లో డాక్టర్ శివకుమార్ ఆనంద్ చిన్న పాత్రలో నటించడం విశేషం. ఫోటో జర్నలిస్ట్ గా పనిచేసే కాలంలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఉదయం నుండి అర్ధరాత్రి వరకు కూడా అలసి పోకుండా పనిచేస్తూనే ఉండేవారు…… అదీ ఆయన గొప్పతనం ……. కష్టపడే తత్వానికి నిదర్శనం.
ఇక 1994 డాక్టర్ శివకుమార్ ఆనంద్ జీవితంలో కీలక మలుపు అనే చెప్పాలి…… ఎందుకంటే బ్యాచ్ లర్ జీవితానికి గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు మరి. సహధర్మచారిణి ఉమాదేవి తన జీవితంలో అడుగు పెట్టిన వేళావిశేషం అనుకుంటా ……. 1995 లో మరో మలుపు తిరిగింది డాక్టర్ శివకుమార్ ఆనంద్ జీవితం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే సమయంలో తన సహచరుడైన ఒక మంచి మిత్రుడు డాక్టర్ గుడిపాటి ఉపేందర్ రెడ్డి సహకారంతో ఫోటోగ్రఫీలో మరిన్ని మెళుకువలు నేర్చుకోవడానికి జపాన్ వెళ్లడం మరో మధుర ఘట్టమనే చెప్పాలి.
డాక్టర్ శివకుమార్ ఆనంద్ పనితనం మెచ్చి , నచ్చి జపనీస్ ఫోటోగ్రాఫిక్ కంపెనీ 3 సంవత్సరాల ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం విశేషం. దాంతో భారత్ లో ఉంటూ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ తిరిగి మూడేళ్ళ పాటు ఆ ప్రాజెక్ట్ వర్క్ ను దిగ్విజయంగా పూర్తి చేయడం విశేషం. 1996 తర్వాత టెక్నాలజీ పరంగా కొత్త పుంతలు తొక్కింది భారతదేశం. దాంతో ఆ సమయంలో ఏపీ నుండి అలాగే ఇతర ప్రాంతాల నుండి అమెరికాకు పెద్ద ఎత్తున యువత వెళ్తుండటంతో ….. నేను కూడా అమెరికా వెళ్లాలని అనుకున్నారు డాక్టర్ శివకుమార్ ఆనంద్. అనుకున్నదే తడవుగా కంప్యూటర్స్ లో మెయిన్ ఫ్రేమ్స్ నేర్చుకున్నారు. ఇంకేముంది 1998 జులై లో అగ్రరాజ్యం అమెరికాకు పయనమయ్యారు.
1998 నుండి 2002 వరకు కన్సల్టెంట్ గా న్యూజెర్సీ ,విస్కాన్సిన్ , చికాగో , న్యూయార్క్ లలో పని చేసారు. 2002 లో గ్రీన్ కార్డు రావడంతో ఇక ఈ జాబ్ చేయకుండా తన మనసుకు నచ్చిన ఫోటోగ్రఫీ చేయాలనే సంకల్పంతో మళ్ళీ మీడియా రంగంలోకి ఎంటరయ్యారు. ఫ్రీలాన్సర్ గా TV 5 , TV 9, NTV , V 6 , సాక్షి , మన తెలుగు తదితర ఛానల్స్ లలో పనిచేసారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్ళు స్థాపించిన తెలుగు – అమెరికా ఆర్గనైజేషన్స్ అయిన TFAS , TANA , ATA , NATA , NATS , TAGDV , TLCA తదితర స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే అన్ని రకాల ఈవెంట్స్ ను కవర్ చేస్తూ ఫోటో అండ్ వీడియో గ్రఫీలో అందరి ప్రశంసలు అందుకున్నారు.
యునైటెడ్ నేషన్స్ లో జరిగే ప్రపంచ సభలకు అటెండ్ కావాలనేది డాక్టర్ శివకుమార్ ఆనంద్ చిరకాల వాంఛ. కాగా ఆ కోరిక 2019 లో మోడీని కలవడంతో తీరింది. 2019 సెప్టెంబర్ లో వరల్డ్ క్లాస్ లీడర్స్ అంతా న్యూయార్క్ లో సమావేశమయ్యారు. కాగా ఆ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం విశేషం. ఆ వేడుకలోనే మోడీతో పాటుగా మిగతా డెలిగేట్స్ ను తన ఛాయాగ్రహణంలో బంధించడం డాక్టర్ శివకుమార్ ఆనంద్ కు మరో మధురానుభూతిని కలిగించే అంశం.

ఇక 2020 సంవత్సరం డాక్టర్ శివకుమార్ ఆనంద్ జీవితంలో మరో మైలురాయి అనే చెప్పాలి. మిత్రుడు అంతకుమించి శ్రేయోభిలాషి , UBlood app ఫౌండర్ అండ్ సీఈవో అయిన జై యలమంచిలి సహాయ సహకారాలతో ….. మీడియా రంగంలో తనకున్న ఇన్నేళ్ల అనుభవాన్ని రంగరించి JSW , Jaiswaraajya అనే వరల్డ్ వైడ్ యూట్యూబ్ ఛానల్స్ తో పాటుగా వెబ్ పేపర్స్ తెలుగు , ఇంగ్లీష్ లను ప్రారంభించడం జరిగింది. JSW & Jaiswaraajya సంస్థలకు గ్లోబల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు డాక్టర్ శివకుమార్ ఆనంద్. న్యూజెర్సీ లో ఈ సంస్థల హెడ్ ఆఫీస్ ఉండగా హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో సిబ్బంది చేత పలు విభిన్న కార్యక్రమాలను చేయిస్తున్నారు.
కులమతాలకు అతీతంగా , అందరినీ కలుపుకుంటూ ఎడ్యుకేషన్ , ఇమ్మిగ్రేషన్ , హెల్త్ , యోగా , ఉమెన్ ఎంపవర్ మెంట్ , బిజినెస్ , జాబ్ ఆపర్చునిటీస్ ఇలా అన్ని రకాల అంశాలను టచ్ చేస్తూ విభిన్న కార్యక్రమాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాదు OTT రంగంలో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు.
డాక్టర్ శివకుమార్ ఆనంద్ భార్య పేరు ఉమాదేవి. భర్తకు ఫోటోగ్రఫీ పట్ల మక్కువ ఉండటంతో ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచింది. ఇద్దరు పిల్లలు కాగా అబ్బాయి సాయి కిరణ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ చేసి మార్స్ శాటిలైట్ కి డిజైన్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఇక అమ్మాయి పేరు శివాని తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న శివాని మరో అడుగు ముందుకేసి ……. న్యూయార్క్ యూనివర్సిటీలో సినిమాటోగ్రఫీలో డిగ్రీ చేస్తుండటం విశేషం.
ఎక్కడో….. పాలమూరులో జీవిత పాఠాలు నేర్చుకున్న డాక్టర్ శివకుమార్ ఆనంద్ ఒక్కో మెట్టు ఎక్కుతూ కష్టాల కడలిని ఈదుకుంటూ ఖండాంతరాలను దాటుతూ …… అంచలంచెలుగా ఎదిగి అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడ్డారు. సెంచరీలు కొట్టే వయస్సు మాది అంటూ 6 పదులు దాటిన వయసులోనూ 24/7 పనిచేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ …… సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేస్తున్నారు.
సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన డాక్టర్ శివకుమార్ ఆనంద్ అసామాన్యమైన విజయాలతో ……. అప్రతిహతంగా దూసుకుపోతున్న సందర్బంగా శుభాకాంక్షలు అందజేస్తోంది తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ.
హ్యాట్స్ ఆఫ్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ …..