
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ” ఒక్కడు ”. గుణశేఖర్ దర్శకత్వంలో ఎమ్మెస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2003 జనవరి 15 న విడుదల అయ్యింది. ఈ సినిమాకు ముందు మహేష్ బాబుకు స్టార్ డం లేదు అనే చెప్పాలి. అంతేకాదు కమర్షియల్ హిట్ కూడా లేదు. ఆ లోటు ఒక్కడు సినిమాతోనే తీరింది.
2003 లో అండర్ డాగ్ గా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మార్నింగ్ షో నుండే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. రిలీజ్ రోజునే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో రికార్డుల మోత మోగింది. వసూళ్ల వర్షం కురిసింది. దాంతో మహేష్ బాబుకు హీరోగా మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఒక్కడు రూపంలో దక్కింది.
ఒక్కడు చిత్రంలో మణిశర్మ అందించిన పాటలు హైలెట్ అనే చెప్పాలి. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికి కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ గా నటించాడు. ఇక అప్పట్లో కరడుగట్టిన విలన్ పాత్రల్లో నటించే ముఖేష్ రుషి ఈ చిత్రంలో మహేష్ ఫాదర్ గా నటించడం విశేషం. మిగిలిన పాత్రల్లో అజయ్ , తెలంగాణ శకుంతల , రాజన్ పి దేవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇక ఇప్పటి విషయానికి వస్తే …….. ఒక్కడు సినిమా విడుదలై 20 ఏళ్ళు పూర్తి అవుతుండటంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 2023 జనవరి 7 న ప్రపంచ వ్యాప్తంగా పలు థియేటర్ లలో మళ్ళీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతికి వారం రోజుల ముందే ఒక్కడు సినిమా రిలీజ్ అవుతుండటంతో మహేష్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. మహేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్ ……. పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్ద ఎత్తున ఉండటంతో హంగామా షురూ చేస్తున్నారు.