
ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్న వేడుకలో హీరో రాంచరణ్ కు కూడా పాల్గొనే గొప్ప అవకాశం లభిస్తోంది. ఇదంతా ఆర్ ఆర్ ఆర్ పుణ్యమే అని చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు అనే పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ సాధించిన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డ్ రాకతో యావత్ ప్రపంచం ఆర్ ఆర్ ఆర్ మేనియాతో దద్దరిల్లిపోతోంది. ఆర్ ఆర్ ఆర్ తో సంచలన విజయం సాధించడమే కాకుండా ఆస్కార్ అవార్డ్ కూడా సాధించడంతో హీరోలు రాంచరణ్ , ఎన్టీఆర్ , దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పేరు మారుమ్రోగుతోంది. ఇక ఈ విషయంలో చరణ్ కాస్త ముందున్నాడు. అల్లూరి సీతారామరాజు పాత్రలో నభూతో నభవిష్యత్ అనే రీతిలో నటించాడని హాలీవుడ్ దిగ్గజాలు చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక తాజా విషయానికి వస్తే…… ఈనెల 18 న దేశ రాజధాని ఢిల్లీలో India Today Conclave సమావేశం జరుగనుంది. కాగా ఆ వేడుకకు మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా హాజరు కానున్నారు. వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమంలో మరో అతిథిగా హీరో రాంచరణ్ కు అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ ముందు చరణ్ ప్రసంగించనున్నారు. ఇలాంటి గొప్ప అవకాశం చరణ్ కు లభించడం మెగా అభిమానులను మరింతగా సంతోషంలో ముంచెత్తే అంశమనే చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధులు ఉండవంటే నమ్మండి. పుత్రోత్సాహంతో ఉప్పొంగి పోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.