ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు దాంతో శుభాకాంక్షలు వెల్లువెలా వచ్చి పడుతున్నాయి. ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన కొణిదెల శివశంకర వరప్రసాద్ వెండితెరకు వచ్చేసరికి చిరంజీవిగా మారాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో అలాగే విలన్ పాత్రల్లో నటించిన చిరంజీవి ఖైదీ చిత్రంతో స్టార్ హీరో అయిపోయాడు.
ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లడంతో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. తెలుగునాట తిరుగులేని స్టార్ హీరోగా యాక్షన్ కు సరికొత్త అర్ధం నేర్పించాడు మెగాస్టార్. కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి బయ్యర్లకు కనకవర్షం కురిపించాడు. అయితే మద్యమద్యలో తన అభిరుచి మేరకు నటనకు అవకాశం ఉన్న పాత్రలను కూడా పోషించాడు.
అయితే వాటిలో కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి. దాంతో తన నుండి ప్రేక్షకులు పక్కా కమర్షియల్ చిత్రాలను మాత్రమే కోరుకుంటున్నారని భావించి అలాంటి చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు. భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోగా చరిత్ర సృష్టించాడు మెగాస్టార్.
అయితే 2009 లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ప్రజలకోసం వెళ్లినప్పటికీ ప్రజలు ఆదరించకపోవడంతో ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే తన వ్యక్తిత్వానికి రాజకీయాలు సరిపడవని భావించిన చిరు రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. మళ్ళీ ఖైదీ నెంబర్ 150 చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వరుస చిత్రాలతో మెగాస్టార్ బిజీగా ఉన్నాడు. ఈరోజు తమ అభిమాన కథానాయకుడి పుట్టినరోజు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు మెగా అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది జైస్వరాజ్య డాట్ టీవీ.
Breaking News