
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్ర రంగప్రవేశం చేసిన కొణిదెల కళ్యాణ్ బాబు మొదటి చిత్రం ” అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ”. 1996 లో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మొదటి చిత్రంతో ఓకే అనిపించాడు కానీ పెద్దగా అలరించలేకపోయాడు. కట్ చేస్తే ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ”గోకులంలో సీత” చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ చిత్రంలో ఎక్కువ సక్సెస్ భాగం రాశికి వెళ్ళిపోయింది.
దాంతో ముచ్చటగా మూడో చిత్రంగా చేసిన సుస్వాగతం చిత్రంతో భారీ హిట్ కొట్టాడు పవన్ కళ్యాణ్. మొదటి చిత్రంలో కళ్యాణ్ బాబు గా నామకరణం వేయగా రెండో చిత్రంతో కళ్యాణ్ బాబు కాస్త ” పవన్ కళ్యాణ్ ” అయ్యాడు. ఇక అప్పటి నుండి వరుస విజయాలతో ఏ హీరోకు లేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సుస్వాగతం చిత్రం తర్వాత తొలిప్రేమ తెలుగు చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ ను యువతకు ఆరాద్య దైవంగా చేసింది.
ఆ తర్వాత తమ్ముడు , బద్రి , ఖుషి చిత్రాలు తెలుగునాట ప్రభంజనం సృష్టించాయి. దాంతో పవన్ కళ్యాణ్ కు ఎనలేని క్రేజ్ వచ్చింది. తమ్ముడు , బద్రి , ఖుషి చిత్రాల ప్రభావం ఎంతగా ఉందంటే పవన్ కళ్యాణ్ కు ఆ తర్వాత కొన్ని డిజాస్టర్ లు వచ్చినప్పటికీ ఇంకా యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉందంటే అది ముమ్మాటికీ ఆ చిత్రాల ప్రభావం అనే చెప్పాలి.
ఖుషి తర్వాత కొంత గ్యాప్ వచ్చినప్పటికీ జల్సా , గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది , గోపాల గోపాల , భీమ్లా నాయక్ చిత్రాలతో సత్తా చాటాడు పవన్ కళ్యాణ్. జయాపజయాలకు అతీతమైన ఇమేజ్ ని క్రేజ్ ని సొంతం చేసుకున్న ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు సుమా !
సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తన ప్రభావం ఏంటో చాటిచెప్పాడు పవన్ కళ్యాణ్. అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షడిగా పనిచేసాడు. తన ప్రసంగాలతో కొత్త ఊపు తెచ్చాడు. అయితే ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపించకపోవడంతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసాడు. అది పవన్ కళ్యాణ్ కు అంతగా ఇష్టం లేదు. అప్పుడు మాత్రమే కాదు ఆ మాటలు ఇప్పుడు కూడా అంటూనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో కనుక ప్రజారాజ్యం పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. ఇక ఇప్పుడేమో జగన్ ముఖ్యమంత్రి అయ్యుండేవాడు కాదు అని బలంగా నమ్ముతాడు పవన్ కళ్యాణ్.
ఉజ్వలమైన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం నడుం బిగించాడు పవన్ కళ్యాణ్. జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి 2014 లో టీడీపీ – బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి ఆ పార్టీలను అధికారికంలోకి వచ్చేలా కృషి చేసాడు. అయితే పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఆ పార్టీలు వ్యవహరించకపోవడంతో మద్దతు ఉపసంహరించుకున్నాడు.
పవన్ కళ్యాణ్ కు అధికారం మాత్రమే కావాలని అనుకుంటే రాష్ట్రస్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఖచ్చితంగా కేబినెట్ పదవి దక్కి ఉండేది. కానీ ప్రజల ఆశీస్సుల ముందు పదవులు లెక్కలోకి రావు అని భావించి అలాంటి పదవులను తృణప్రాయంగా వదులుకున్నాడు. ఇక రాబోయే రోజుల్లో ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి 2024 లో జరిగే శాసన సభ ఎన్నికల్లో జనసేనను అధికారంలోకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు జనసేనాని.
తనని అమితంగా అభిమానించే ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనే సంకల్పంతో ఉన్నాడు జనసేనాని. అందుకే స్వతంత్య్ర భారతంలో ఏ నాయకుడు చేయని పనికి శ్రీకారం చుట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏ నాయకుడు చేయలేని పని పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నాడు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొని మరణిస్తే ఏ ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాలను ఆదుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన కష్టార్జితాన్ని కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి వెచ్చిస్తున్నాడు.
ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఏ నాయకుడు కూడా చేయలేదు అంటే అతిశయోక్తి కాదు సుమా ! ఈ ఘనత సాధించిన ఏకైక నాయకుడు మన జనసేనాని కావడం విశేషం. హీరో అంటే తెరమీద మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా అని నిరూపించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రభుత్వాలు సాగిస్తున్న దమనకాండని చూసి కళ్ళు , చెవులు మూసుకుంటున్న ఈ ప్రపంచంలో……. అలాంటి ప్రభుత్వాలను
ప్రశ్నిస్తున్న ఏకైక జన నాయకుడు మన జనసేనాని కావడం మనమంతా గర్వంగా చెప్పుకునే అంశం అనే చెప్పాలి. సెప్టెంబర్ 2 మన జనసేనాని పుట్టినరోజు. ఆ సందర్బంగా జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది జైస్వరాజ్య డాట్ టీవీ.