నటభూషణ్ శోభన్ బాబు జయంతి ఈరోజు. 1937 జనవరి 14 న కృష్ణా జిల్లాలోని నందిగామలో జన్మించారు. సినిమా రంగంలోకి వెళ్లాలని భావించిన శోభన్ బాబు మద్రాస్ లో అడుగుపెట్టి అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. అలాంటి సమయంలో అన్న నందమూరి తారకరామారావు ప్రోత్సాహంతో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరాగ్ర కథానాయకుడిగా ఎదిగారు శోభన్ బాబు. కుటుంబ కథా చిత్రాలకు ముఖ్యంగా ఇద్దరు భార్యల కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు శోభన్.
సాధారణంగా ఇద్దరు భార్యలు చేసుకున్న హీరో అంటే మహిళలకు అస్సలు నచ్చదు…… కానీ శోభన్ బాబు మాత్రం ఇద్దరు పెళ్లాలను చేసుకునే సినిమాలను మాత్రం ఎక్కువగా ఆదరించింది మహిళా ప్రేక్షకులు కావడం గమనార్హం. ఆరోజుల్లో మహిళామణులకు బాగా ఇష్టమైన హీరో ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు శోభన్ బాబు.
తెలుగు సినిమా రంగంలో ఎన్టీఆర్ , అక్కినేని ల తర్వాత అంతటి స్టార్ డం అందుకున్న హీరో శోభన్ బాబు. కృష్ణ మాస్ హీరోగా సంచలనం సృష్టిస్తుంటే మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన చిత్రాలను చేస్తూ చెరగని ముద్ర వేసిన హీరో శోభన్ బాబు. ఎన్టీఆర్ , అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ , కృష్ణంరాజు లతో కలిసి పెద్ద సంఖ్యలో మల్టీస్టారర్ చిత్రాలను చేసిన హీరో శోభన్ బాబు. ఇక తనకంటే జూనియర్ హీరోలయిన చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు , డాక్టర్ రాజశేఖర్, సుమన్ , రాజేంద్రప్రసాద్ , అర్జున్ తదితర హీరోలతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. సినిమాల్లో సంపాదించిన కష్టార్జితాన్ని భూమి పై పెట్టుబడులుగా పెట్టి అపర కుబేరుడు అయ్యారు శోభన్ బాబు.
ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్న సమయంలోనే స్వచ్ఛందంగా సినిమాలకు గుడ్ బై చెప్పిన మహనీయుడు శోభన్ బాబు. తనని ఆదరించి అక్కున చేర్చుకొని కెరీర్ ప్రారంభంలో పలు సినిమాలు రావడానికి కారకుడైన ఎన్టీఆర్ అంటే ఎనలేని భక్తి శోభన్ బాబుకు . అందుకే ఎన్టీఆర్ నిలువెత్తు ఫోటోను శోభన్ బాబు తన పూజామందిరంలో పెట్టుకున్నాడంటే ఎన్టీఆర్ అంటే ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు శోభన్ బాబు జయంతి కావడంతో ఆయన్ని తలచుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు శోభన్ బాబు అభిమానులు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే 2008 మార్చి 20 న అర్దాంతరంగా ఈలోకాన్ని విడిచి అభిమానులను శోకసంద్రంలో ముంచారు.