మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పలువురు నటీనటులు నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం పలు దఫాలుగా షూటింగ్ జరుపుకుంటోంది. చరణ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. దాంతో ఈ సినిమా టైటిల్ ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ ఏంటి అన్నది రివీల్ చేయలేదు. కాకపోతే మూడు రకాల టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. ఇంతకీ ఆ టైటిల్స్ ఏంటో తెలుసా ……… 1) అధికారి 2 ) సర్కారోడు 3) నందన్ IPS . ఈ మూడు రకాల టైటిల్స్ ను పరిశీలిస్తున్నారట చిత్ర బృందం.
సినిమా కథ ప్రకారం ఈ మూడు టైటిల్స్ కూడా సరిపోతాయని , అయితే యూనిట్ సభ్యుల్లో ఎవరు ఎక్కువగా ఏ టైటిల్ పట్ల మొగ్గు చూపుతారో ఆ టైటిల్ ను ఖరారు చేయనున్నట్లు సమాచారం. శంకర్ అంటే ఒకప్పుడు భారతీయ సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. కానీ ఇటీవల కాలంలో శంకర్ నుండి సరైన బ్లాక్ బస్టర్ రావడం లేదు. అలాంటి సమయంలో ఈ సినిమా పట్టాలెక్కింది. కట్ చేస్తే కమల్ హాసన్ తో ఆగిపోయిన భారతీయుడు 2 మళ్ళీ పట్టాలెక్కింది. దాంతో చరణ్ సినిమాకు బ్రేకులు పడ్డాయి. కమల్ సినిమాను చేస్తూ మధ్య మధ్యలో చరణ్ సినిమా కానిస్తున్నాడు శంకర్. దాంతో చరణ్ సినిమా బడ్జెట్ పెరిగి పోతోందట.