మెగాస్టార్ చిరంజీవిని భారతీయ జనతా పార్టీ రాజకీయంగా వాడుకోవాలని భావిస్తోందా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అందులో భాగంగానే వీలు కుదిరినప్పుడల్లా చిరంజీవిని అభినందించడం , సన్మానించడం జరుగుతూ వస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి ప్రస్తావన రాగా తాజాగా మరోసారి చిరంజీవిని ” ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 ” అవార్డుకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ చిరంజీని ప్రశంసిస్తూ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.
ఏకంగా ప్రధాని తెలుగులో ట్వీట్ చేయడంతో చిరంజీవి పరవశించి పోతున్నాడు. అయితే రాజకీయాల్లోకి వచ్చి విఫలమైన చిరంజీవి మళ్ళీ రాజకీయాల జోలికి వెళ్ళేది లేదని ఖరాకండిగా చెబుతూనే ఉన్నాడు. అయితే క్రియాశీలక రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని , భారతీయ జనతా పార్టీకి రాబోయే ఎన్నికల్లో మద్దతు ఇస్తే సరిపోతుందనే భావనతో ఉన్నారట బీజేపీ నాయకులు.
ఆంధ్రప్రదేశ్ లో ఎలాగూ తమ్ముడు పవన్ కళ్యాణ్ తో బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి ఆ తమ్ముడికి అన్న మెగాస్టార్ మద్దతు ఇస్తే ……. 2024 ఎన్నికల్లో చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తే ….. ఏమో గుర్రం ఎగరా వచ్చు అన్న చందంగా అద్భుత ఫలితాలు సాధించకపోతామా ? అనే ఆశల పల్లకిలో ఊగుతున్నారట కాషాయ దళాలు. అయితే చిరంజీవి మాత్రం రాజకీయాలు అంటేనే భయపడిపోతున్నాడు పాపం ప్రజారాజ్యం తెచ్చిన తలవంపులను తల్చుకుంటూ.