సినీ నటి , దర్శకురాలు , నిర్మాత జీవిత రాజశేఖర్ చాలాకాలం తర్వాత మళ్ళీ నటనపై మక్కువ ప్రదర్శిస్తోంది. హీరో డాక్టర్ రాజశేఖర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. అంతకుముందు మాత్రం తమిళ , తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఎక్కువగా డాక్టర్ రాజశేఖర్ కాంబినేషన్ లో సినిమాలు చేయడంతో ప్రేమలో పడ్డారు. దాంతో పెళ్లి చేసుకున్నారు. ఇంకేముంది పెళ్లి అయ్యాక ” మగాడు ” చిత్రంలో మాత్రమే నటించింది జీవిత.
ఇక ఆ తర్వాత రాజశేఖర్ వ్యవహారాలు చూసుకుంటూ పిల్లల బాధ్యతలు చేపట్టింది. కట్ చేస్తే దర్శకురాలు అయ్యింది , నిర్మాత అయ్యింది కానీ నటిగా మాత్రం కొనసాగలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నటించడానికి సిద్ధమైంది జీవిత. ఇంతకీ ఏ సినిమాలో తెలుసా ……. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ” లాల్ సలాం ” చిత్రంలో.
రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం లాల్ సలాం. విష్ణు విశాల్ హీరో కాగా ఆ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఇక రజనీకాంత్ కు సోదరిగా జీవిత నటించనుంది. ఈ పాత్రకు జీవితే కరెక్ట్ అంటూ ఐశ్వర్య పట్టుబట్టిందట. దాంతో కాదనలేకపోయింది. మార్చి మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననుంది జీవిత. దాదాపు 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమైపోయింది జీవిత.