
అభినవ దాన కర్ణుడిగా బారతానా కీర్తించబడుతున్న కథానాయకుడు సోనూ సూద్ మరో మహత్కార్యానికి శ్రీకారం చుట్టాడు. గతకొంత కాలంగా ఆపదలో ఉన్నవాళ్లకు అండగా నిలబడుతూ సేవలు అందించిన సోనూ సూద్ ఇటీవల కాలంలో” సూద్ ఛారిటీ ఫౌండేషన్ ” ద్వారా ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కూడా కల్పించాడు. ఇక ఇపుడేమో మోకాళ్ళ నొప్పులతో సరిగ్గా నడవలేని వృద్దులకు మోకాలి శస్త్ర చికిత్స ఉచితంగా అందించడానికి నడుం బిగించాడు.
50 ఏళ్ల తర్వాత సహజంగానే మోకాలి నొప్పులతో బాధపడేవాళ్లు ఉంటారు. ఇక కొంతమంది అయితే మోకాలి నొప్పుల వల్ల కనీసం అడుగు కూడా వేయలేక ఇబ్బంది పడుతున్నవాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళు మోకాలి శస్త్ర చికిత్స తీసుకోవాలంటే పెద్ద మొత్తంలోనే డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంత డబ్బు పెట్టి మోకాలికి శస్త్ర చికిత్స తీసుకునే ఆర్ధిక స్థోమత లేని వాళ్ళు కోకొల్లలు.
అందుకే అలాంటి వాళ్లకు పెద్ద కొడుకుగా మీకు అండగా ఉంటానని ముందుకు వచ్చాడు సోనూ సూద్. మోకాలికి శస్త్ర చికిత్సతో పాటుగా పూర్తిగా మోకాలి చిప్ప కూడా మార్చే సదుపాయాన్ని కల్పిస్తున్నాడు సోనూ సూద్. మోకాలి శస్త్ర చికిత్స కోసం ఆరాటపడే వాళ్ళు ” soodcharityfoundation.org ” అనే వెబ్ సైట్ లో తమ వివరాలను నమోదు చేసుకుంటే ఫౌండేషన్ వాళ్ళు ఫోన్ చేసి ముంబైకి తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తారు. కాబట్టి మీకు తెలిసిన ఈ పథక లబ్ధిదారులు ఉంటే వెంటనే సోనూ సూద్ ఫౌండేషన్ కు అప్లికేషన్ పెట్టుకోండి…… ఆపరేషన్ చేయించుకొని హాయిగా నడవండి.