సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహా ప్రస్థానంలో ముగిసాయి. కైకాల సత్యనారాయణ పెద్ద కొడుకు లక్ష్మీ నారాయణ అంత్యక్రియలు నిర్వహించాడు. ఫిలిం నగర్ నుండి మహా ప్రస్థానం వరకు ర్యాలీగా బయలుదేరింది కైకాల పార్దీవ దేహం ఉన్న వాహనం. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య కైకాల అంత్యక్రియలు ముగిసాయి. దారి పొడవునా కైకాలకు నీరాజనాలు పలికారు ప్రజలు , అభిమానులు.
దాదాపు 800 చిత్రాల్లో నటించాడు కైకాల. దాదాపు 60 ఏళ్ల నటజీవితంలో కైకాల సత్యనారాయణ చేయని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు సుమా ! పౌరాణిక , జానపద , చారిత్రాత్మక , సాంఘిక చిత్రాల్లో అన్ని రకాల పాత్రలను పోషించి మెప్పించాడు. ఇక యముడు పాత్రలంటే పెట్టింది పేరు కైకాల సత్యనారాయణ. అత్యధిక చిత్రాల్లో యముడిగా నటించి చరిత్ర సృష్టించాడు. డిసెంబర్ 23 న 87 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు.
దాంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు స్టార్ హీరోలు , నటీనటులు , సాంకేతిక నిపుణులు , రాజకీయ ప్రముఖులు కైకాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు. మహానటుడు కైకాల సత్యనారాయణకు తగిన గౌరవం ఇవ్వాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడం విశేషం.