
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన కాట్రగడ్డ మురారి ( 78) అక్టోబర్ 15 న రాత్రి చెన్నై లోని తన స్వగృహంలో కన్నుమూశారు. దాంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. విజయవాడలో జన్మించిన కాట్రగడ్డ సినిమాలపై మక్కువతో డైరెక్టర్ కావాలని మద్రాస్ లో అడుగు పెట్టారు. అయితే మద్రాస్ లో అడుగుపెట్టిన తర్వాత డైరెక్షన్ పక్కన పెట్టి నిర్మాతగా మారారు. సంగీత , సాహిత్య నేపథ్యంలో పలు చిత్రాలను నిర్మించారు.
కాట్రగడ్డ మురారి నిర్మించిన చిత్రాల్లో సీతామహాలక్ష్మీ , త్రిశూలం, శ్రీనివాస కల్యాణం, నారి నారి నడుమ మురారి, గోరింటాకు, జానకి రాముడు, అభిమన్యుడు మంచి విజయాన్ని సాధించాయి. మంచి చిత్రాలను నిర్మించడమే కాదు వివాదాస్పద వ్యక్తి కూడా. ముక్కుసూటిగా మాట్లాడి పలువురు దర్శక నిర్మాతలకు, పలువురు నటీనటులకు ఇబ్బంది కరంగా తయారయ్యారు. ఆ విషయాలను పక్కన పెడితే తెలుగులో మాత్రం మంచి చిత్రాలను అందించారు. అక్టోబర్ 15 న రాత్రి భోజనం చేసిన తర్వాత తిరిగిరాని లోకాలకు వెళ్లారు. కాట్రగడ్డ మురారి మృతికి పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.