సూపర్ స్టార్ కృష్ణ , నటభూషణ్ శోభన్ బాబు మల్టీస్టారర్ కాంబినేషన్ లో వచ్చిన సంచలన చిత్రం ” ముందడుగు ”. కె. బాపయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ డి. రామానాయుడు నిర్మించారు. 1983 ఫిబ్రవరి 25 న విడుదలైన ముందడుగు సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలై ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తి అయ్యింది. దాంతో అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు , రచయితలు పరుచూరి బ్రదర్స్.
అప్పట్లో ఎక్కువగా కృష్ణ – శోభన్ బాబు లు మల్టీస్టారర్ చిత్రాలు చేసారు. తెలుగులో ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలను చేసింది కృష్ణ – శోభన్ బాబు కావడం విశేషం. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు దాదాపుగా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఒకటి అరా తప్ప అన్నీ సూపర్ డూపర్ హిట్ లే అయ్యాయి. దాంతో కృష్ణ – శోభన్ బాబు కాంబినేషన్ కు అంతగా క్రేజ్ ఉండేది.
శోభన్ బాబు – కృష్ణ ఇద్దరు కూడా మంచి మిత్రులు దాంతో ఆ స్నేహం సినిమాల విషయంలో కూడా కొనసాగింది. ఇక ముందడుగు విషయానికి వస్తే ……. డబ్బున్న యువకుడిగా శోభన్ బాబు నటిస్తే కార్మికుడిగా కృష్ణ నటించాడు. శోభన్ బాబు సరసన శ్రీదేవి కృష్ణ సరసన జయప్రద నటించారు. పరుచూరి బ్రదర్స్ రచన అందించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి అందించిన పాటలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఆరు పాటలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ముఖ్యంగా శోభన్ బాబు – శ్రీదేవి మీద చిత్రీకరించిన ” నాకొక శ్రీమతి కావాలి దానికి నీ అనుమతి కావాలి ” అనే పాట అప్పట్లో ట్రెండ్ సృష్టించింది. అప్పట్లో యువతరం ఎక్కువగా పాడుకునే పాట ఇదే అంటే అతిశయోక్తి కాదు సుమా ! ఇక మిగతా పాటలు ” ఏ తల్లి కన్నదో నిన్ను ” , ” వేయి పడగల మీద ” , ” ప్రేమకు నేను పేదను కాను ” , ” చిలకలూరి పేట కాడ చిలుకో ” , ” పోరా ఓ కంత్రి మామా ” కూడా పాపులర్ అయ్యాయి.