రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం హైదరాబాద్ లోని మహా ప్రస్థానంలో జరుగనున్నాయి. కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా పని చేయడంతో పాటుగా సినిమా రంగంలో కూడా రారాజుగా వెలుగొందిన వ్యక్తి కావడంతో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. కృష్ణంరాజు మరణ వార్త బీజేపీ శ్రేణులను షాక్ అయ్యేలా చేసింది. దాంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు తీవ్ర విచారం వెలిబుచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు, అలాగే ప్రభాస్ కు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఏ ఐ జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ప్రస్తుతం ఆసుపత్రిలోనే కృష్ణంరాజు పార్దీవ దేహన్ని ఉంచారు. మరికొద్ది సేపట్లోనే కృష్ణంరాజు పార్దీవ దేహాన్ని ఇంటికి తరలిస్తారు. ఆ తర్వాత యూసుఫ్ గూడ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకు తరలించే ప్రక్రియ చేపట్టనున్నారని తెలుస్తోంది. అక్కడ అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత ఫిల్మ్ ఛాంబర్ లో కొద్దిసేపు ఉంచిన తర్వాత అక్కడి నుండి నేరుగా మహాప్రస్థానం లో రేపు మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.