
రెబల్ స్టార్ కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజుల కుటుంబం కృష్ణంరాజు ది కావడం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో 1940 జనవరి 20 న జన్మించారు రెబల్ స్టార్. యుక్త వయసు వచ్చాక హైదరాబాద్ వచ్చి ఫోటో స్టూడియో పెట్టుకున్న కృష్ణంరాజు సినిమాల మీద ఇంట్రెస్ట్ తో మద్రాస్ కు వెళ్లారు. కృష్ణ , శోభన్ బాబు లతో కలిసి పలు ప్రయత్నాలు చేసారు. వాళ్లకు అవకాశాలు వెంటనే లభించగా కృష్ణంరాజుకు మాత్రం గట్టి పోరాటమే చేయాల్సి వచ్చింది. దాంతో కృష్ణంరాజు ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చి అవకాశాలు ధారాళంగా వచ్చి పడ్డాయి.
అయితే హీరోగా మాత్రం నిరూపించుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. హీరోగా నటించడమే కాకుండా విలన్ గా కూడా నటించారు. విలన్ పాత్రలను పక్కన పెట్టి సొంత చిత్ర నిర్మాణం చేపట్టి బ్లాక్ బస్టర్ లను కొట్టారు. అంతేకాదు హీరోగా నిలబడి సత్తా చాటారు. స్టార్ హీరో అయ్యారు రెబల్ స్టార్ కృష్ణంరాజు.
ఇక రెబల్ స్టార్ కెరీర్ లో దాదాపు 190 కి పైగా చిత్రాల్లో నటించారు. అయితే కృష్ణంరాజు అనగానే చిరస్థాయిగా నిలిచిపోయిన అపురూప చిత్రాల జాబితా ఉంది. అందులో మచ్చుకు కొన్ని.
1) కృష్ణవేణి : తన తమ్ముడు సూర్యనారాయణతో కలిసి గోపికృష్ణా మూవీస్ అనే బ్యానర్ స్థాపించి నిర్మించిన చిత్రం ” కృష్ణవేణి ”. వి. మధుసూధనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా కృష్ణంరాజుకు మొట్ట మొదటి సంచలన విజయాన్ని అందించిన చిత్రం. వాణిశ్రీ కథానాయికగా నటించింది. ఈ సినిమా కృష్ణంరాజు నట జీవితాన్ని మలుపు తిప్పింది.
2) భక్త కన్నప్ప : కన్నడంలో సూపర్ హిట్ ఐన బీదర కన్నప్ప చిత్రాన్ని తెలుగులో ” భక్త కన్నప్ప ”గా రీమేక్ చేసారు. ఇది కూడా కృష్ణంరాజు సొంత సినిమా కావడం విశేషం. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా వాణిశ్రీ నటించింది. ఈ సినిమా తెలుగునాట ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికి కూడా ఈ చిత్రంలోని పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు మహాశివరాత్రి వచ్చిందంటే చాలు తప్పకుండా భక్త కన్నప్ప సినిమా బుల్లితెర పై పడాల్సిందే.
3) అమర దీపం : కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా సూపర్ హిట్. కృష్ణంరాజుతో పాటుగా మురళీమోహన్ , జయసుధ నటించారు. కమర్షియల్ హిట్ గా నిలిచింది.
4) కటకటాల రుద్రయ్య : దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం ” కటకటాల రుద్రయ్య ”. కృష్ణంరాజు కెరీర్ లో భారీ కమర్షియల్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది.
5) మనవూరి పాండవులు : బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కృష్ణంరాజుని కొత్తకోణంలో చూపించింది.
6) రంగూన్ రౌడీ : దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రంగూన్ రౌడీ కమర్షియల్ గా హిట్ అయ్యింది.
7) శ్రీ వినాయక విజయం : భక్త కన్నప్ప చిత్రంలో శివ భక్తుడిగా నటించిన కృష్ణంరాజు ఈ చిత్రంలో శివుడిగా నటించి మెప్పించాడు. ఇక వినాయకచవితి వస్తే తప్పకుండా ఈ చిత్రం బుల్లితెరపై సందడి చేయాల్సిందే.
8) బెబ్బులి : వి. మధుసూధనరావు దర్శకత్వంలో తెరకెక్కిన బెబ్బులి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది.
9) ధర్మాత్ముడు : భైరిశెట్టి భాస్కర్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కృష్ణంరాజు కెరీర్ లో మరో మలుపు అనే చెప్పాలి.
10) బొబ్బిలి బ్రహ్మన్న : కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గోపికృష్ణా మూవీస్ బ్యానర్ పై నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు చలన చిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కృష్ణంరాజు కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది ఈ చిత్రం.
11) రారాజు : రామ్మోహన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కృష్ణంరాజును రారాజుగా నిలిపింది.
12) తాండ్ర పాపారాయుడు : దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. కృష్ణంరాజు నటజీవితంలో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా కృష్ణంరాజు సొంత సినిమా కావడం విశేషం.
13) అంతిమ తీర్పు : మలయాళ దర్శకులు జోషి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం. కృష్ణంరాజు అనగానే రెబల్ అనే ముద్ర ఉంటుంది. అయితే ఇందులో విభిన్నమైన కృష్ణంరాజు కనిపించాడు. ఇది కూడా రెబల్ స్టార్ నటజీవితంలో విభిన్నమైన చిత్రం.