సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా రాణించారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్న కృష్ణంరాజు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరారు కృష్ణంరాజు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్ సభకు పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి 1998లో భారతీయ జనతా పార్టీలో చేరారు. వెంటనే కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి సంచలన విజయం సాధించారు.
అయితే వాజ్ పేయి ప్రభుత్వం ఏడాదికే పడిపోవడంతో 1999 లో మళ్లీ లోక్ సభకు ఎన్నికలు జరుగగా ఈసారి నరసాపురం నుండి పోటీ చేశారు. నర్సాపురం నుండి కూడా ఘనవిజయం సాధించారు కృష్ణంరాజు. దాంతో వాజ్ పేయి కృష్ణంరాజు కు కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు అప్పగించారు. కేంద్ర సహాయ మంత్రి గా వాజ్ పేయి నేతృత్వంలో పనిచేశారు కృష్ణంరాజు. అయితే 2004 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి ప్రారంభించడంతో బీజేపీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ తరుపున లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు కృష్ణంరాజు దాంతో ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసి కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కట్ చేస్తే 2014 లో మళ్లీ బీజేపీలో చేరారు. గవర్నర్ గా కృష్ణంరాజు ను నియమించడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే కృష్ణంరాజు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆపదవి దక్కలేదు.